గుడిపాల ఘటనతో బయటపడిన గ్యాస్ దందా
పలు ఏజెన్సీలపై అనుమానాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడిపాల ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన గ్యాస్ దోపిడీ ఘటనతో అసలు వ్యవహారం బయటపడగా, ఇప్పుడు జిల్లాలోని మరిన్ని గ్యాస్ ఏజెన్సీలపై కూడా అదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ విధానాన్ని పక్కనబెట్టి సిలిండర్లను అక్రమంగా సరఫరా చేస్తున్న ఈ వ్యాపారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. సాధారణంగా గృహవినియోగ గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఓటీపీ విధానం తప్పనిసరి. వినియోగదారుడికి మొబైల్ ఫోన్‌న్‌కు వచ్చే ఓటీపీని చూపిన తరువాతే సిలిండర్ ఇవ్వాలి. అయితే ఈ నియమాన్ని పక్కన పెట్టి కొంతమంది ఏజెన్సీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత నెలలోనే వేల సంఖ్యలో ఓటీపీలు లేకుండా సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సుమారుగా 40 వేలకు పైగా సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22 ఏజెన్సీలుంటే.. అందులో కొన్ని ఏజెన్సీలు వేలల్లో బ్లాక్‌లో సిలిండర్లు పెట్టినట్టు తెలుస్తోంది.
గుడిపాల ఘటనతో..
గుడిపాల ఘటన బయటపడిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ఏజెన్సీలపై తనిఖీలు ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీపీ లేకుండా సరఫరా చేసిన సిలిండర్ల జాబితాను బయటకు తీయడంలో అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఏజెన్సీల్లో కూడా?
కొన్ని గ్యాస్ ఏజెన్సీలు పౌరసరఫరాల శాఖ అధికారులతో కుమ్మకై ్క ఈ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగానికి సరైన సమాచారం అందించకుండా తప్పుడు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణను ఉద్దేశపూర్వకంగా నెమ్మదింపజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అధికార పార్టీ మద్దతు, ధనబలంతో అధికారుల తనిఖీలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సమాచారం. దీంతో నిజాలను వెలికితీయడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఈ గ్యాస్ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాను కుదిపేస్తున్న
ఓటీపీ అక్రమాలు


