అప్పుడే శాపమైంది! | - | Sakshi
Sakshi News home page

అప్పుడే శాపమైంది!

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

● అప్పు చెల్లించమని అడిగినందుకు హత్య ● వరుసకు పిన్నీనే స్నేహితులతో కలసి హత్య చేసిన యువకుడు ● కీలకముద్దాయి అరెస్ట్‌, మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న వేట ● వివరాలు వెల్లడించిన పలమనేరు డీఎస్పీ

పలమనేరు: ఏదో సొంత బిడ్డలాంటివాడు.. కష్టాల్లో ఉన్నాడని అప్పు ఇవ్వడమే ఆమెకు శాపంగా మారింది. ఇచ్చిన అప్పును చెల్లించమని అడిగినందుకు దారుణ హత్యకు గురైంది. నియోజకవర్గంలోని పెద్దముద్దేపల్లికి చెందిన ఎల్‌ చంద్రమ్మ(33) దారుణహత్యకు గురై పలమనేరు మండలంలోని జగమర్ల అడవిలో మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. ఈ హత్యలో కీలక ముద్దాయి అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(22)ను పోలీసులు అరెస్ట్‌ చూపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ మీడియాకు వివరించారు. భర్తను వదిలేసిన చంద్రమ్మ పెద్దపంజాణిలో టైలరింగ్‌షాపు నిర్వహిస్తూ చీటీలను నడిపేది. వరుసకు కుమారుడైన సుబ్రమణ్యం ఆమె ఇంటికి వస్తూ ఉండేవాడు. తనకు ఏవో సమస్యలున్నాయంటూ రూ.2 లక్షలకుపైగా పిన్ని వద్ద అప్పుచేశాడు. అయితే అప్పు చెల్లించకపోవడంతో ఆమె నిలదీయడం మొదలుపెట్టింది. ఎలాగైనా ఆమెను మట్టుబెట్టాలని సుబ్రమణ్యం పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాడు. నిడిగుంట గ్రామంలోని తన బావమరిది దేవీవరప్రసాద్‌ వద్ద తీసిస్తానంటూ గతనెల 30వ తేదీన తన బైక్‌పై తీసుకెళ్లాడు. ఆపై ఆమె కనిపించకుండాపోయింది. నిందితుడే మృతురాలి కుటుంబీకుల వద్దకెళ్లి తాను నిడిగుంటకు తీసుకెళుతుండగా ఎవరో బొలేరో జీపులో వచ్చి మమ్మల్లి కొట్టి పిన్నిని కిడ్నాప్‌ చేశారంటూ కథ అల్లాడు. ఆపై ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. వారు గతనెల 31న మహిళ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నేరస్థుడ్ని పట్టించిన రక్తపు మరక

సుబ్రమణ్యంపై ఓ కన్నేసిన పోలీసులు గతనెల 31న ముత్తుకూరు క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. పోలీసులకు విచారిస్తున్న సమయంలో అతని షర్ట్‌పై రక్తపు మరకను గుర్తించారు. ఆపై తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకుని!

చంద్రమ్మ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును సుబ్రమణ్యం ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్టు పోలీసులకు తెలిపాడు. ఏమి చేసినా తాను అప్పు కట్టలేనందునే ఇలా స్నేహితులతో కలసి చంపినట్టి అంగీకరించాడు. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారిని పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నందున నిందితులకు జీవిత ఖైదు పడేలా చూస్తామని ఆయన తెలిపారు. ఇకపై పట్టణ ఆవాసాల్లోనూ రాత్రిపూట గస్తీని ముమ్మరం చేస్తామని, క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలపై ఫోకస్‌ పెట్టామని తెలిపారు. ఇందులో గంగవరం సీఐ పరశురాముడు, పెద్దపంజాని ఎస్‌ఐ మారెప్ప పాల్గొన్నారు.

పక్కా ప్లాన్‌తోనే!

అప్పు చెల్లించలేని సుబ్రమణ్యం తన బావమరిది అయిన దేవీవరప్రాద్‌, స్నేహితుడైన షేక్‌నూర్‌మహ్మద్‌తో కలిసి ఆమెను హత్య చేయాలని ప్లాన్‌ వేశాడు. ఇందులో భాగంగా వారు తులసిమొనెమ్మ గుడి సమీపంలోని ఓ మామిడితోపులో బొలేరో వాహనంతో సిద్ధంగా ఉండగా ఇతను చంద్రమ్మను బైక్‌పైకి అక్కడికి తీసుకెళ్లాడు. ఉన్నట్టుండి ముగ్గురూ కలిసి ఆమె తలపై ఇనుపరాడ్‌తో కొట్టి ఆపై గొంతుకోసి హతమార్చారు. ఈ సమయంలో ఆమె శరీరంలోంచి రక్తపు మరకులు నిందితులపై పడినట్టు తెలిసింది. తర్వాత అనుమానం రాకుండా మృతదేహాన్ని బొలోరేలో వేసుకుని పలమనేరు సమీపంలోని జగమర్ల అడవిలో పడేసి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement