నగరి : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ మంచి చేశామని, నేడు మరో పార్టీ అధికారంలో ఉందని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా తెలిపారు. ఆమె శనివారం తన నివాస కార్యాల యం వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. మరోవైపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఓటర్ల సవరణకు ఎస్‌ఐఆర్ ఐదు విడతల్లో చేపట్టినట్టు తెలిపారు. బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించకుండా, అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు చేర్చకుండా చూడాలని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారిని ఎప్పటికప్పుడు ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. మరణించిన వారి ఓట్లను తొలగింపులోను శ్రద్ధ చూపాలన్నారు. ఇతర ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఇక్కడ కూడా ఓట్లు ఉన్నవారిని గుర్తించాలన్నారు. మనం అధికారంలో ఉన్నంతకాలం అందరికీ మంచి చేశామని, ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. మీకు నేను అండగా నిలబడతానని, నాకు జగనన్న అండగా ఉంటారని, అందరమూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంలో బూత్ కమిటీ సభ్యులు కీలకమని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇది మన పని అన్న భావనతో బీఎల్వోలు పనిచేయాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అందరికీ మంచి జరుగుతుందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోంది
చంద్రబాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ బినామీల పేరుతో 90 పైసలకే భూములు ఇస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలనూ గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర బూత్ కమిటీ మేనేజర్ భరత్, తిరుపతి, చిత్తూరు జిల్లాల బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ఓటర్ల చేర్పు, తొలగింపు, ఎస్‌ఐఆర్‌పై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ గాంధీ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్‌రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన బూత్ కమిటీ సభ్యులు
మాట్లాడుతున్న మాజీమంత్రి ఆర్కేరోజా


