ప్రైవేటీకరణకు పట్టం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణకు పట్టం

Mar 28 2026 7:42 AM | Updated on Mar 28 2026 7:42 AM

● ఏజెన్సీల చేతికి చైల్డ్‌లైన్‌ –1098 నిర్వహణ ● రాష్ట్ర స్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తి ● గందరగోళంలో సిబ్బంది భవితవ్యం

ఆపదలో ఉన్న చిన్నారులకు కొండంత అండగా నిలిచే చైల్డ్‌లైన్‌–1098 వ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జీవో)ల నుంచి ఐసీడీఎస్‌ పరిధిలోకి మారిన ఈ విభాగం, ఇప్పుడు ప్రైవేట్‌ ఏజెన్సీల పరం కానుంది. సిబ్బంది కొరత, నిర్వహణ బాధ్యతల మార్పుల మధ్య చిన్నారులకు అందే అత్యవసర సేవలు ఏ మేరకు మెరుగుపడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

చిత్తూరు కలెక్టరేట్‌ : అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులకు సేవలు అందించేందుకు ఉద్దేశించిన చైల్డ్‌లైన్‌ –1098 నిర్వహణను ప్రభుత్వం ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. గతంలో ఇది స్వచ్ఛంద సంస్థలు(ఎన్‌జీవో), ఆ తర్వాత ఐసీడీఎస్‌ ద్వారా నడిచేది. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న నెపంతో ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. ఉన్నతాధికారులు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. అర్హత కలిగిన ఏజెన్సీ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

ఆందోళనలో ఉద్యోగుల భవితవ్యం

చైల్డ్‌లైన్‌ –1098 వ్యవస్థ ప్రైవేటీకరణ నిర్ణయంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ఆందోళనలో పడింది. వారి తొలగింపునకు సంబంధించి ఇచ్చిన మూడు నెలల నోటీసుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. తమను ఐసీడీఎస్‌ పరిధిలోనే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. కొత్త ఏజెన్సీ వస్తే పాత వారినే తీసుకుంటారా లేదా కొత్త వారిని నియమించుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

నిర్వహణలో గందరగోళం

చైల్డ్‌ లైన్‌–1098 విభాగం గత రెండేళ్లలో పదే పదే చేతులు మారింది. ముందు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉండేది. 2024 జూలై 8వ తేదీ నుంచి ఐసీడీఎస్‌ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పదే పదే యాజమాన్యం మారడం వల్ల వ్యవస్థ స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పిల్లల అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి కీలక బాధ్యతలు చూసే ఈ విభాగం ప్రభుత్వం, ప్రైవేట్‌ మధ్య నలుగుతోంది. దీనికితోడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 8 మంది ఉండాల్సిన చోట నలుగురే ఉన్నారు. నిర్వహణలో స్పష్టత లేకపోవడం వల్ల ఆపదలో ఉన్న పిల్లలకు అందాల్సిన సేవలు సకాలంలో అందుతాయా లేదా అన్నదే అసలైన ఆందోళన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement