బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ సిలిండర్లు
తిరుపతి సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్‌పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 ఉన్నాయి. గత 20 రోజులుగా జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సరఫరాకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. ఆలయాలు, ట్రస్టులు, హాస్టళ్లు, ఆస్పత్రులు తదితరాలకు గ్యాస్ సరఫరాకు మినహాయింపు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు దొరక్క పలు హోటళ్లు మూతపడ్డాయి. పలుకుబడి ఉన్న హోటళ్లకు మాత్రం సిలిండర్లు బ్లాక్‌లో తరలుతున్నాయి. చిరు వ్యాపారాలకు మాత్రం మొండి చేయి మిగిలింది.
గ్యాస్ బ్లాక్ పేరిట బహిరంగ దోపిడీ
గ్యాస్ బ్లాక్ పేరుతో ఒక్క సిలిండర్‌కు రూ.2,000 వర కు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. అధికారిక ధరలు ఒకవైపు ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో భారీగా దోపిడీ జరుగుతున్నట్టు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొందరు ఏజెన్సీలు పూర్తిగా పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సరఫరా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుని కావాల్సిన వారికి మాత్ర మే సిలిండర్లు అందజేస్తూ మిగతా వారిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు చెల్లించే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ చిన్న వ్యాపారులను పక్కన పెట్టేస్తున్నారని బాధితులు అంటున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆల యాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్‌లు పెట్టుకుని బ్లాక్‌లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
దొంగ బుకింగ్‌ల దందా ...
ఈ గందరగోళంలో మరింత సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల పేర్లతో అక్రమంగా బుకింగ్‌లు చేసి గ్యాస్ సిలిండర్లను మళ్లిస్తున్నలు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్‌లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుడిపాల ప్రాంతంలో ఈ దొంగ బుకింగ్‌ల వ్యవహారం భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. వినియోగదారులకు తెలియకుండానే వారి పేర్లతో బుకింగ్‌లు నమోదు చేసి, గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది జిల్లాలో పెద్ద స్కామ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే ‘‘జంపింగ్’’ పేరుతో ఏజెన్సీలు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒక ఏజెన్సీ నుంచి మరొక దానికి బాధ్యతలు మళ్లిస్తూ సమస్య నుంచి తప్పించుకుంటున్నాయని అంటున్నారు.
చిత్తూరు జిల్లాలో గ్యాస్ బ్లాక్ మయమవుతోంది. కొందరు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇరాన్– ఇజ్రాయేల్ యుద్ధ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గ్యాస్ కొరతను చూపిస్తూ అక్రమాలకు తెరలేపారు. ఓటీపీలకు మంగళం పాడి.. దొంగచాటు బుకింగ్‌లు మొదలు పెట్టారు. బండ వ్యాపారంగా మార్చుకుని కాసులు దండుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక మొత్తానికి విక్రయిస్తున్నారు. తమకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినట్టు వచ్చిన మెసేజ్‌లను చూసిన వినియోగదారులు ఇలా ఎందుకు వచ్చిందని ఏజెన్సీలను నిలదీయడంతో జంపింగ్ మెసేజ్‌లు వస్తున్నాయని మభ్యపెడుతున్నారు. సామాన్య వినియోగదారులను తిప్పలు పెడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై పౌర సరఫరాల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొందరు అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫార్సుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్‌లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రమేనని పలువురు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఈ గ్యాస్ గందరగోళంపై అధికారులు ఇప్పటికై నా స్పందిస్తారా..? అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


