జీడీనెల్లూరులో ఓ ఇంటి స్థలానికి సర్వేయర్ గ్రామ కంఠం భూమిగా సర్టిఫికెట్ ఇచ్చినట్టు నకిలీ పత్రాన్ని సృష్టించారు. దాన్ని చూపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై బాధితుడు పట్టాభి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్వేయర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఇందులో స్థానిక టీడీపీ నేత నటరాజ మొదలియార్‌తోపాటు ఆరుగురు కుట్ర చేశారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు కూడా నమోదైంది. పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు ముందుకు సాగలేదు.
గతంలో చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఉన్న స్థలం, మరో ఆరు స్థలాలకు సంబంధించిన యజమానుల సంతకాలను ఏడుగురు సభ్యుల ముఠా ఫోర్జరీ చేసింది. రూ.కోట్లు విలువైన భూములను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలను సైతం పొందడం సంచలనం రేపింది. ఈ వ్యవహరంలో అప్పట్లో తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్, వీఆర్వోలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
చిత్తూరు కార్పొరేషన్: అనాదిగా వస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అప్పుడప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని క్రయ విక్రయదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ అక్రమాలకు వేదికగా మారిందని, వీటిపై కలెక్టర్, ఏసీబీ దృష్టి పెట్టాలని గత నెలలో ‘సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవి నీతి జలగలు’ అన్న శీర్షికన సాక్షి దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. సీఎంవో కార్యాలయం ఆరా తీసిన విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు స్పందించిన అధికారులు తనిఖీలు చేశారు. అందులో లెక్కలో చూపని మొత్తం రూ.1,12,730 స్వాధీనం చేసుకున్నారు.
పదేళ్ల తర్వాత తనిఖీలు
ఏసీబీ అధికారులు చిత్తూరు జిల్లా కేంద్రంలో తనిఖీలు చేసి దాదాపు పదేళ్లు అవుతోంది. 2016 సెప్టెంబర్, 2018 నవంబరులో సోదా లు నిర్వహించారు. తదుపరి 8 ఏళ్ల తర్వాత తిరిగి తనిఖీలు చేపట్టారు. ఇన్నేళ్లు గ్యాప్ ఇవ్వకుండా అప్పుడప్పుడు సోదాలు నిర్వహిస్తుంటే రైటర్లు, అధికారుల్లో భయం ఉంటుందని, ఇలా చిత్తూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు చెబుతున్నారు.
చేయి తడిపితేనే ఫైల్ ముందుకు
మాకేమీ లేదు.. రైటర్లు ఇచ్చింది తీసుకుంటాం.. అని సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది చెబుతూ ఉంటారు. వాస్తవానికి రైటర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకుండా అక్కడ ఏ పని జరగదనేది బహిరంగ రహస్యం. ఉద్యోగులు ఉదయం విధుల్లోకి వచ్చినప్పుడు ఎంత నగదు తెచ్చారు.. సాయంత్రం విధులు ముగించేటప్పుడు ఎంత నగదు ఖర్చు చేశారు అన్న వివరాలను క్యాష్ బుక్‌లో నమోదు చేయాలి. జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఈసీ, సీసీ మొదలు స్టాంప్ పేపర్, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్, ఈ–కేవైసీ ఇలా ప్రతి దాంట్లోనూ చేయి తడపనిదే పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. సొసైటీ, అసోసియేషన్స్, ఫర్‌మ్స్ పనులు కూడా సకాలంలో కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్‌చార్జిలే దిక్కు
చిత్తూరు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. నాలుగేళ్ల క్రితం సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న రహంతుల్లా బదిలీ అయి నప్పటి నుంచి ఇన్‌చార్జిలతోనే నడిపిస్తున్నారు. రెండేళ్ల క్రితం రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్‌గా అశోక్ ఉద్యోగ విరమణ ముందు బాధ్యతలు తీసుకుని సెలవుపై వెళ్లారు. తదుపరి ఇన్‌చార్జిలతోనే పాలన సాగింది. ఇటీవల కర్నూలు జిల్లా నుంచి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చిన ఆయన మరో మూడు నెలల తర్వాత ఉద్యోగ విరమణ చేయనున్నారు. రైటర్లు, ఫోర్జరీ ముఠా, కార్యాలయ ఖర్చులంటేనే భయపడిపోతున్నామని కొందరు అధికారులు చెప్పుకుంటున్నారు.
చిత్తూరులోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
సాక్షిలో ప్రచురితమైన కథనం
కీలకంగా మారిన రైటర్లు
ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కీలకం. రిజిస్ట్రేషన్ చేసుకుంటే గాని ఆ భూమి లేదా స్థలం, ఆస్తులపై పూర్తి స్థాయిలో హక్కు లభించదు. ఈ క్రమంలో కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కానిచ్చేస్తున్నారు. అధికారులు పనిని బట్టి రేటు మాట్లాడుకుని అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇందులో చిత్తూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ముందు వరుసలో ఉన్నారు. రైటర్ల అండతో హవా సాగిస్తున్నారు. చేయి తడపనిదే దస్త్రం కదలడం లేదు. స్లాంపు పడడం లేదు. పైసలు ఇస్తే కలెక్టర్ కార్యాలయాన్ని సైతం అమ్మేస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఏసీబీ అధికారులు చిత్తూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేసిన నేపథ్యంలో ప్రత్యేక కథనం.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రైటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిందే వేదంగా మారింది. అన్నీపోనూ మాకేమీ మిగలదు రోజువారీ కూలీ తప్ప అని రైటర్లు చెప్పుకోవడం అలవాటుగా మారింది. నిజానికి రైటర్ గా రాకముందు.. ఆ తర్వాత వారి ఆస్తులు, వారి జీవన విధానాన్ని పరిశీలిస్తే రూ.వేల నుంచి లక్షలు, కోట్లకు ఎలా పడగలెత్తారన్న విషయం తెలుస్తుంది. అంతేగాక భూములు, బంగారం, కార్లు కొనుగోలు, వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తున్నారో అర్థం అవుతుంది. చిత్తూరులో ఏకంగా తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసి అక్రమ రిజిస్ట్రేషన్‌కు యత్నించడాన్ని బట్టి చూస్తే రైటర్లు ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు.


