చిత్తూరు రూరల్ (కాణిపాకం) : డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ది అపోలో యూనివర్సిటీ వీసీ హెచ్.వినోద్ భట్ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరం మురకంబట్టుంలోని ది అపోలో యూనివర్సిటీ, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – రీసెర్చ్ (ఎఐఎంఎస్‌ఆర్), ప్యాకల్టీ రీసెర్చ్ ఫోరం సంయుక్తంగా చేపట్టిన డౌన్ సిండ్రోమ్ అవేర్‌నెస్ డే, క్లినికల్ సైటోజెనెటిక్స్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణలో ఆధునిక వైద్య విధానాలు కీలకమన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనాటమీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సుభద్ర దేవి వెలిచేటి మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్‌కు సంబంధించిన డేటా సేకరణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. మన దేశంలో నమోదైన కేసులు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్యు నిర్ధారణ సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తల్లిదండ్రులు, సంరక్షకుల కోసం రూపొందించిన పేరెంట్ గైడ్‌ను విడుదల చేశారు. వర్క్‌షాప్‌లో భాగంగా నిర్వహించిన క్లినికల్ సైటోజెనెటిక్స్ సెషన్‌లో అకాడమిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.జీవన్ కుమార్ జన్యు నిర్ధారణ పద్ధతులు, రోగి సంరక్షణలో వాటి ప్రాముఖ్యతపై వివరించారు.


