స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ
శ్రీరంగరాజపురం : ప్రైవేటు స్కూల్ బస్సును వెనుక వైపు నుంచి కంటైనర్ లారీ బలంగా ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న విద్యార్థులుకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారి క్షీరసముద్రం బీసీ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. గంగాధరనెల్లూరు మండలం, ఎట్టేరి శ్రీభానోదయ ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు స్కూల్ బస్ విద్యార్థులను ముద్దుకుప్పం, జీ.యం.ఆర్.పురం, నెలవాయి గ్రామాల్లో ఎక్కించుకుంది. ఆపై క్షీరసముద్రం బీసీ.కాలనీ వద్ద ఆగి విద్యార్థులను ఎక్కిస్తుండగా చైన్నె నుంచి వస్తున్న కంటైనర్ లారీ వేగంగా స్కూల్ బస్సును వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సులో 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు విద్యార్థుల కాళ్లు బస్సులోనే ఇరుక్కుపోయాయి. స్థానికులు కట్టర్ సాయంతో కట్ చేసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.
స్టేచర్ అందుబాటులో లేక
గాయపడిన విద్యార్థిని చేతులపై మోసుకెళ్తున్న తల్లిదండ్రులు
అందుబాటులో లేని వైద్యులు
గాయపడిన విద్యార్థులను స్థానిక పీహెచ్స్‌సీకి తరలించారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేదు. ఆపై స్థానికులు ప్రయివేటు వాహనాలు, 108 సాయంతో గాయపడిన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తప్పిన పెను ముప్పు
స్కూల్ బస్సును కంటైనర్ లారీ బలంగా ఢీ కొట్టడంతో లారీ పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ స్తంభం విరిగి నిటారుగా నిలబడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ విద్యుత్ స్తంభం స్కూల్ బస్సుపై పడి ఉంటే పెను ప్రమాదం సంభవించేది.
స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ
స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ


