మళ్లీ రెండు హామీలు
నగరి ప్రజలకు మొండిచేయి చూపిన చంద్రబాబు నిరాశ పరచిన ముఖ్యమంత్రి ప్రసంగం హామీల ప్రస్తావనే లేకుండా పర్యటన ఇచ్చిన వాటికే దిక్కులేకుంటే కొత్తగా మరో రెండు బాబు మాట్లాడుతుండగానే తిరుగుముఖం పట్టిన జనం
నగరి : స్వర్ణాంధ్ర ..స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భా గంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నగరి పట్టణానికి విచ్చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించారు. అయితే ఇచ్చిన హామీలపై ఎలాంటి ప్రకటన చేయకుండా నగరి వాసులకు మొండి చేయి చూపారు. నియోజకవర్గానికి ఏంచేస్తారో చెప్పకుండా దావోస్, యూరప్, జపాన్, చైనా, సౌత్‌కొరియా అంటూ దేశాల పర్యటన గురించి ఊదరగొట్టడం అందరికి విసుగు తెప్పించింది.
చెరుకు రైతులకు చేదే!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తారని, తమ కు రావలసిన బకాయిలు ఇప్పిస్తున్నట్లుగా ప్రజా వేదికలో తీపికబురు అందిస్తారని ఎదురుచూసిన చెరుకు రైతులు ఆశగా ఎదురు చూశారు. అయితే చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో దిగారు పడ్డారు.
కంటి తుడుపు మాటలు
విషపూరిత రసాయనాలు విడుదల చేసే డైయింగ్ యూనిట్లు నగరి పట్టణవాసులను రోగాల బారిన పడేస్తున్నాయి. తాగడానికి, నిత్యావసరాలకు నీరు లేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపుతారని ప్రజలు ఎదురుచూశారు. అయితే త్వరలోనే పరిష్కరిస్తామని కంటి తుడుపు మాటలు చెప్పడంతో పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు మాట్లాడుతుండగానే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోతున్న ప్రజలు
ఉన్న హామీలకే దిక్కులేకుంటే మళ్లీ కొత్తగా రెండు హామీలను నగరి సభలో చంద్రబాబు ప్రకటించారు. 2029 ఎన్నికలలోపు గాలేరు నగరి పథకం పూర్తి చేసి కృష్ణాజలాలను నగరికి తీసుకువస్తామని మరో హామీ గుప్పించారు. కోసలనగరంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరోకటి ప్రజలపై వదిలారు. ఊకదంపుడు మాటలకు జనం విసిగిపోయి ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో సభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.


