బాబు షో.. అట్టర్ ఫ్లాప్
నగరి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో షో చేస్తామ ని నగరికి వస్తే, అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. శనివారం తన నివాసంలో ఆమె మీడియాతో మా ట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో, మరిన్ని వరాలు కురిపిస్తారేమో అని ఎదురుచూసిన ప్రజలు నివ్వెరపోయారన్నారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర పేరుతో చేపట్టిన కార్యక్రమం అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అబద్ధాల ఆంధ్రగా మారిందని ఆరోపించారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ చెప్పుకునేందుకు ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. ప్రస్తుత నగరి ఎమ్మెల్యే, ఆయన తండ్రి సైతం నియోజకవర్గానికి చేసింది శూన్యమని స్పష్టం చేశారు. డయాలసిస్ సెంటర్, పార్కు, షాదీమహాల్, కల్యాణ మండపాలు, క్రిమేషన్ సెంటర్ తదితరాలన్నీ జగనన్న ప్రభుత్వంలో నిర్మించామని వివరించారు. ఈటీపీ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసి భూ గర్భ జలాలు కలుషితం చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమదే ప్రధాన పాత్రని ఆరోపించారు.
హమీలన్నీ గాలికే!
నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తామని మోసం చేశారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. చెరుకు రైతులకు ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేశారని విమర్శించారు. మామిడి రైతులకు చెల్లించాల్సిన బకాయిల ఊసే ఎత్తకపోవడం దారుణమ ని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగనన్న రీసర్వే చేపట్టినప్పుడు విష ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అది తన ఘనతగా చెప్పుకోవడం దిగజారుడుతనమని స్పష్టం చేశారు. రీసర్వే కారణంగానే ప్రస్తుతం ప్రభుత్వానికి రూ.400 కోట్ల రాయితీ వచ్చిందని తెలిపారు. పాస్‌బుక్‌పై ఫొటోను తప్పుపట్టిన చంద్రబాబు, గతంలో మరుగుదొడ్లు, అప్పడాలు, సైకిళ్లు, మిషన్ల మీద కూడా ఫొటో వేసుకున్నారని విమర్శించారు.
ప్రాజెక్టుల తాకట్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు ఆపేయలేదా అని ప్రశ్నించారు. చివరకు రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు మారారని మండిపడ్డారు. నగరి సభ సాక్షిగా రైతుల ఊపిరిని చంద్రబాబు తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సభ జరుగుతుండగానే జనం వెళ్లిపోయారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ విమానాల్లో తిరిగేందుకు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. రాష్ట్రంలో 6 కోట్ల జనాభా ఉంటే 23 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించడం చంద్రబాబుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని నగరికి తీసుకువచ్చిన ప్రజాప్రతినిధులను జనమే చొక్కా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు.


