రూ.12 లక్షలు వంకపాలు!
చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఓ టీడీపీ నేత లక్షణంగా రోడ్డు వేశామని... జనాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. కుప్పకూలిన రోడ్డులో ఓ బైక్ ఇరుక్కుపోయి శనివారం అవస్థలు పడ్డాడు. ఆ వివరాలు ఇలా..
గతేడాది వర్షానికి చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట వంకలో రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. ఈ వంకలో జీడీ నెల్లూరు మండల వాసులు పలు పనుల నిమిత్తం వస్తూ పోతుంటారు. వారి అంతరాయం ఆసరాగా చేసుకుని వంక మధ్యలో రోడ్డు వేయాలని ప్లాన్ వేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.12 లక్షల వరకు మంజూరు చేయించుకున్నారు. నీటి ప్రవాహం కుదుట పడిన వెంటనే పనులు ప్రారంభించారు. సిమెంట్ పైపులను అడ్డం పెట్టి మట్టి కప్పారు. ఆ పని తూతూమంత్రంగా చేయడంతో రెండు రోజులకే నాణ్యత తేలిపోయింది. వంక మధ్యలో రోడ్డు కుంగింది. నాలుగు రోజు కు పెద్ద పెద్ద చీలికలు పడి.. మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉంది. కాలి నడక వెళ్లే వారు అతి జాగ్రత్తతో వంక దాటుతున్నారు.
కుంగిన రోడ్డులో..జారి పడిపోయారు...
జీడీనెల్లూరు మండలం కడపగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి తనకు మారుడితో కలిసి శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్‌పేట గ్రామానికి బయలుదేరాడు. నెమ్మదిగా వంక రోడ్డు దాటుతు న్న సమయంలో ద్విచక్రవాహనంను కుంగిన రోడ్డు లాగేసింది. తండ్రి, కొడుకులు ఇద్దరు..ఈ గోతిలో పడ్డారు. వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
ద్విచక్రవాహనం మాత్రం బాగా ఇరుక్కుపోయింది. అటువైపుగా వెళుతున్న కొందరు ఈవిషయాన్ని గమనించి...ఇరుక్కపోయిన ద్విచక్రవాహ నాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారు. పైపుల మధ్య ముందు చక్రం ఇరుక్కుపోవడంతో అరగంట పాటు శ్రమించారు.రోడ్డును మళ్లీ బాగుచేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందులోనైనా నాణ్యత ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు.


