వణుకు పుట్టిస్తోంది!
దగ్గరికొచ్చేదాకా కనిపించని వాహనాలు రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం అత్యవసరమైతేనే రాత్రి జర్నీ చేయాలంటున్న నిపుణులు రానున్న పండుగల ప్రయాణాలు కష్టమే
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 7 దాకా దట్టంగా మంచు కురుస్తోంది. జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు. మరోవైపు వాహనదారులకు ముప్పు తిప్పలు ఎదుర్కొంటున్నారు. పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. ఇక ఈనెల 25న క్రిస్మస్, డిసెంబర్ 31, జనవరి 1, సంక్రాంతి పండుగలు ఉండడంతో జర్నీకి ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కనిపించని రోడ్లు
రోడ్లపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం నుంచి మంచు ప్రభావం పెరుగుతోంది. 100 నుంచి 200 మీటర్ల వరకు రోడ్డు కనిపించడం లేదు. ఉదయం 9 దాటినా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. దగ్గరికి వచ్చే దాకా ఎదురుగా వచ్చే బండ్లు కానరావడం లేదు. వాహనం ముందు దారుందో, వాహనం ఆగి ఉందో తెలియడం లేదు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు బెంగళూరు మార్గం, చిత్తూరు–వేలూరు, చిత్తూరు–పుత్తూరు, పలమనేరు–కుప్పం, ఇరువారం క్రాస్–తిరుపతి, పలమనేరు– పుంగనూరు రహదారులపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.
జిల్లాలో దట్టమైన మంచు
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
కొత్త రోడ్లపై మలుపులు, రహదారుల స్థితిగతులపై అవగాహన ఉండాలి
మంచు తెరలు తొలిగిపోయాకే ప్రయాణాన్ని కొనసాగించాలి.
వాహనానికి వెనుక, ముందు రేడియం స్టికర్లను అతికించాలి.
వాహనానికి ఫాగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవాలి. పసుపు వర్ణంతో వెలిగే ఈ దీపాలు శీతాకాలంలో ఎంతో మంచిది. –బండి స్పీడ్ లిమిట్‌లో పెట్టుకోవాలి. ముందు వెళ్తున్న వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయొద్దు.
వెహికల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి
వాహనాలను రోడ్ల పక్కకు తీసుకెళ్లి ఖాళీ ప్రదేశంలో లేదా వెలుతురు ఉన్న చోట నిలపాలి.
బండి ఆగిపోతే నంబరు 100కు ఫోన్‌న్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి
అద్దాలను తుడిచే వైఫర్లు సక్రమంగా ఉంచుకోవాలి.
వాహనం పూర్తిగా కండిషన్‌న్‌లో ఉండాలి


