విద్యార్థుల్లో పోటీతత్వం ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో పోటీతత్వం ముఖ్యమని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో నైపుణ్యం ఉంటుందన్నారు. విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. పోటీ పరీక్షల పట్ల ఆసక్తి చూపి ప్రతిభ సాధించాలన్నారు. ఈ ఏడాది నవంబర్ 27, 28 తేదీల్లో జిల్లా స్థాయిలో జరిగిన కౌశల్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. ఈ పోటీల్లో మొదటి ర్యాంకు సాధించిన 8వ తరగతి విద్యార్థిని సరే సబ్రిన్ (రొంపిచెర్ల, బాలికల పాఠశాల), 9వ తరగతిలో మహమ్మద్ సాహిబ్ (మున్సిపల్ హైస్కూల్, కొత్త ఇండ్లు, పుంగనూరు), 10వ తరగతిలో విశాల్ (జెడ్పీ, నెల్లేపల్లి, జీడీనెల్లూరు మండలం) ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారిని డీఈవో అభినందించారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1,500, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.1000 చొప్పున నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించారు. జిల్లా సైన్స్ అధికారి అరుణ్‌కుమార్, కౌశల్ జిల్లా జాయింట్ కో–ఆర్డినేటర్ యుగంధర్‌రెడ్డి, గుడిపాల ఎంఈవో హసన్‌బాషా పాల్గొన్నారు.


