భలే ఫేమస్!
ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్న జనం వారానికోరోజు శనివారం మాత్రమే సంత బక్రీద్, రంజాన్ ముందు కోట్లలో వ్యాపారం కొండల్లో తిరిగే పొట్టేళ్ల మాంసం బహురుచి
కోట్లలో వ్యాపారాలు
పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంత రాష్ట్రంలోనే ఫేమస్. ఇక్కడికి ఖరీదైన కార్లతోపాటు అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారులు క్యూ కడుతుంటారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంటారు. వారంలో ఒక్క శనివారం మాత్రమే జరిగే ఈ సంతలో కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. బక్రీద్, రంజాన్ తదితర పండుగ రోజుల్లో అయితే ఇది రెట్టింపు అవుతుంటుంది. అసలు ఒక్క పొట్టేళ్ల సంత ఇంత ఫేమస్ కావడానికి కారణాలేంటో మీరే ఓ లుక్కేయండి.
పలమనేరు: రుచికరమైన భోజనాలు.. నాణ్యమైన ఆహార పదారాలు దొరుకుతాయంటే ప్రజలు ఎంత దూరమైనా వెళ్లిపోతుంటారు. తమకిష్టమైన వాటిని ఆరగిస్తుంటారు. అలాగే తమకవసరమైన వంటకాలను ఇళ్లకు తెచ్చుకుని కుటుంబ సభ్యులతో కలిసి భుజిస్తుంటారు. అలా ఒక్కోదానికి ఒక్కోరకంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇలాంటిదే పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంత రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ నుంచి సైతం వ్యాపారులు వచ్చి నచ్చిన పొట్టేళ్లను కొనుగోలు చేస్తుంటారు.
ఖరీదైన కార్లలో రాక
ఇక్కడ కొన్న మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను ఎక్కువగా కొనే వ్యాపారులు టెంపోల్లో తరలిస్తుంటారు. చాలామంది వీటి కోసం కార్లలో వచ్చి తీసుకెళుతుంటారు. నచ్చిన పొట్టేళ్లను కొని కార్లలో దూర ప్రాంతాలకు తరలిస్తుంటారు. సాధరణంగా కొత్తగా ఈ సంతకు వచ్చే వారెవరైనా ఇక్కడ కనిపించే వందల కొద్దీ ఖరీదైన కార్లను చూసి ఇన్ని కార్లు ఎందుకొచ్చాయంటూ ఆశ్చర్యపోవాల్సిందే. వారపు సంత రోజు కిలోమీటర్ల మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లు, వాహనాలను అదుపు చేసేందుకు పోలసులుండాల్సిదే.
ఆ రెండు పండుగల కోసమే
బక్రీద్ పండుగలో మాంసాహారం చాలా ముఖ్యం. స్థోమతగల ముస్లిం కుటుంబీకులు ఖుర్భానీ పేరిట పేదలకు మాంసాన్ని దానం చేస్తారు. ఈ పండుగకు ఎంత ఖరీదైన పొట్టేళు, మేకలను కొంటే వారికి అంత గౌరవంగా భావిస్తారు ముస్లింలు. అసలు ఈ పండుగ కోసమే ఈ ప్రాంతంలో చాలామంది పొట్టేళ్లను సంరక్షిస్తుంటారు. ఏడాదంతా వీటిని సాకి బక్రీద్‌కు మాత్రమే విక్రయిస్తుంటారు.
పలు ప్రాంతాల నుంచి జీవాలు
కేవలం బైరెడ్డిపల్లి సంతలో విక్రయించేందుకు ఉమ్మడి చిత్తూరు, అనంతపూర్ జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. వీటకి పచ్చి గడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి సంరక్షిస్తారు. దీంతో కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. వీటని ఇక్కడి సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు.
సంతలో జరిగే చేతి రుమాలు కింది వ్యాపారం
బైరెడ్డిపల్లె పొట్టేళ్ల సంతకు క్యూ కడుతున్న వ్యాపారులు
ఒక్కడి సంతలో కోట్ల రూపాయల మేర వ్యాపారాలు జరుగుతుంటాయి. గత బక్రీద్ సంత మాత్రమే రూ.20 కోట్ల దాకా వ్యాపారం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణ శనివారాల్లో ఇక్కడికి 20వేలకు పైగా పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు వస్తుండగా పండుగ సంతలకు సుమారుగా 40 వేల నుంచి 50 వేలదాకా వస్తుంటాయి. జత పొట్టేళ్లు రూ.40 వేల నుంచి అత్యధికంగా రూ.2 లక్షలకు పైగా పలుకుతుంటాయి.
భలే ఫేమస్!
భలే ఫేమస్!


