చిత్తూరులో గుప్పు..గుప్పు!
విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు
బీడీ, సిగరెట్లకన్నా సులువుగా
లభిస్తున్న వైనం
వ్యసనంగా మార్చుకుని బానిసలవుతున్న యువత
కలెక్టర్ స్వయానా చెబుతున్నా..
ఫలితం శూన్యం
చిత్తూరు అర్బన్: రెండు లక్షల మందికి పైగా ఉన్న చిత్తూరు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. మూడు జీపులు తీసుకుని సరిగ్గా రెండు గంటలు తిరిగితే నగరంలో ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారు..? గంజాయి తాగుతున్న వాళ్లు ఎవరో..? సులువుగా గుర్తుపట్టొచ్చు. కానీ అలా జరగడం లేదు. సరైన సమాచా రం లేకనో.? దీనిపై ఖాకీలకు నిఘా లేదో తెలియడం లేదుగానీ..నగరంలో ఎక్కడబడితే అక్కడ గుప్పు.. గుప్పుమంటూ గంజాయి వాసన కమ్మేస్తోంది.
ఆదాయం రావట్లేదా?
చిత్తూరు నగరంలో పేకాట క్లబ్బులు, నిషేధిత లాటరీ టికెట్లు భారీగా నిర్వహిస్తున్నా ప్రశ్నించే దిక్కు లేదు. వీటి నుంచి కొందరు ఖాకీలకు నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయని ఆరోపణలున్నాయి. కొందరు పోలీసు అధికారులను నమ్మకుండా గత ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ బృందంతో పేకాట క్లబ్బులపై దాడులు చేయించి, వాటిని మూయించారు. అయినాసరే కొందరు ఖాకీల కనుసన్నల్లో ఇవి యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. కానీ గంజాయి విక్రయాలు వీధి వీధికి జరుగుతున్నా కొందరికి పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టకపోవడంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. గంజాయి డాన్‌ల నుంచి పెద్దగా ఆదాయం లభించడంలేదో..? ఏమోగానీ .? అందుకే దీన్ని నివారించడంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలోని గాంధీ రోడ్డు, తోటపాళ్యం శివారు, నీవానది, తేనబండ, కై లాశపురం, భరత్‌నగర్, గాంధీ నగర్, శంకరయ్యగుంట, సత్యనారాయణపురం, మురకంబట్టు కూడలి, శ్రీనివాసనగర్, చామంతిపురత తదితర ప్రాంతాల్లో చీకటిపడితే గంజాయి వాసన వస్తున్నా పోలీసుల కంట పడకపోవడం ఏమిటని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
చిత్తూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ
సమీపంలో గంజాయి లభించే ప్రాంతం
మాదకద్రవ్యాల నివారణపై విద్యాసంస్థల నిర్వాహకులతో మాట్లాడుతున్న కలెక్టర్, ఎస్పీ
కలెక్టర్ చెప్పినా అంతే
చిత్తూరు నగరంలో గంజాయి విక్రయాలు, వాడకంపై ఇటీవల కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదులు వెళ్లాయి. మైనర్లు, ముఖ్యంగా విద్యార్థులు గంజాయి తీసుకోవడాన్ని సరదాగా ప్రారంభించి.. ఆపై దీనికి బానిసలుగా మారిపోతున్నారని విన్నవించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్, ఎస్పీతో కలసి విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రముఖలతో సమావేశం నిర్వహించారు. అసలు బీడీ, సిగరెట్లు, కై నీ, గుట్కా లాంటి వాటిని విద్యాసంస్థల ఆవరణల్లో విక్రయించకూడదని.. మైనర్లకు ఇవి అందుబాటులో ఉంచొద్దని ఆదేశించారు. గంజాయి అనేది చిత్తూరు నగరంలో ఎక్కడా కనిపించకూడదని గట్టిగానే హెచ్చరించారు. కానీ క్షేత్ర స్థాయిలో గంజాయి విక్రయాలు బీడీ, సిగరెట్లకన్నా సులువుగా లభిస్తున్నాయి. వీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.
కట్టడి చేస్తాం
చిత్తూరులో గంజాయి విక్రయాలు, అమ్మకాలపై ఇద్దరు సీఐలు ప్రత్యేక నిఘా ఉంచారు. విక్రయాలతో పాటు వాటి మూలాలను కనిపెడుతాం. ఎక్కడైనా విక్రయాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎవరైనా సరే వన్‌టౌన్–9440796707, టూటౌన్– 9491074517, డయల్–112 నంబర్లకు సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం.
– టీ.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు
చిత్తూరులో గుప్పు..గుప్పు!


