దేవుడి భూమికే శఠగోపం! | - | Sakshi
Sakshi News home page

దేవుడి భూమికే శఠగోపం!

Dec 12 2025 6:33 AM | Updated on Dec 12 2025 6:33 AM

దేవుడి భూమికే శఠగోపం!

దేవుడి భూమికే శఠగోపం!

● కాలక్రమేణా అర్చకుల ఇనాం భూములుగా మారిన వైనం ● ఇప్పుడు ఎకరా రూ.20 కోట్లు ● ఆ భూమిపై కూటమి నేతలు, ఓ ప్రజాప్రతినిఽధి కన్ను ● లీజు పేరుతో కబ్జాకు కుట్ర ● అడ్డుకున్న స్థానికులు

ఇరువారంలో 3.2 ఎకరాల దేవుడి మాన్యం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: బాబు ప్రభుత్వంలో కొందరు నేతలు దేవుళ్ల భూములకు శఠగోపం పెడుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసేందుకు అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. అడ్డదిడ్డంగా భూములను నొక్కేసేందుకు పావులు కదుపుతున్నారు. లీజు పేరుతో ఆలయ భూములను అపన్నంగా దోచేయాలని ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో అర్చకులు, దేవదాయశాఖ అధికారులకు వల చేస్తున్నారు. ఓ సామాజికవర్గ బలాన్ని ప్రదర్శిస్తున్న ఓ అధికారి ఈ భూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

చిత్తూరు నగరం, ఇరువారం ప్రాంతంలో దేవదాయశాఖకు సంబంధించిన 3.3 ఎకరాల భూమి ఉంది. తరతరాలుగా ఈ భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంటూ.. కాలక్రమేణా అర్చకుల ఇనాంభూములుగా మారాయి. ఒకప్పుడు ఆలయాల్లో పూజా కై ంకర్యాలు చేస్తూ.. ఈ భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ.. తద్వారా వచ్చే ఫలాలను అర్చకుల కుటుంబ అవసరాలకు ఉపయోగించేవారు. అయితే ఈ భూమిని ఎవరికీ అమ్మకూడదు. కేవలం అర్చకులు మాత్రమే అనుభవించే హక్కు ఉంది. కానీ రికార్డుల్లో ఇదీ దేవదాయశాఖ భూమిగానే రికార్డుకెక్కింది. అర్చకులు మాత్రం ఈ భూమి ఒకప్పుడు మహాదేవ గురుకుల్‌ పేరుతో ఉండేదని, తర్వాత ఆయన నలుగురు కొడుకుల్లో వైద్యనాథ గురుకుల్‌ అనే కొడుకు పేరుతో పత్రాలు మారాయని చెబుతున్నారు. ఈ భూమిలో జాతీయ రహదారికి 1.5 ఎకరాలు తీసుకున్నారని, ఇందుకు గాను పరిహారంగా నగదు కూడా జమైనట్టు వారు పేర్కొంటున్నారు. ఇక ఇదే ఈ భూమిలో ఇరువారం గ్రామస్తులు మునీశ్వరుడికి తరతరాలుగా పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే కోట్లు పలికే ఈభూమిని కొట్టేసేందుకు ఓ ప్రజాప్రతినిధి, కూటమి నేతలు పావులు కదుపుతున్నారు.

లీజు..గలీజు!

కలెక్టర్‌రేట్‌ మీదుగా బెంగళూరు వెళ్లే మార్గంలో ఇరువారం ప్రాంతం వద్ద ఉన్న ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఈ భూమి కోట్లల్లో పలుకడంతో నేతలు భూ దోపిడీకి కంకణం కట్టారు. ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుపట్టారు. ఆ భూ వివరాలపై లోతుగా ఆరా తీశారు. దేవదాయశాఖ భూమిగా గుర్తించి.. ఆ అనుభవదారులను పిలిపించారు. లీజు పేరుతో 25 ఏళ్లు ఇచ్చేయాలని ఒప్పందానికి దిగారు. ఆ ఒప్పందం సందిగ్దంలో పడింది.

బోరు వేసేందుకు యత్నం

ఇంతలో అడ్డగోలుగా ఓ ప్రజాప్రతినిధి సహకారంతో లీజుకు ముందుండి నడిపిస్తున్న నేతలు జేబీసీలతో చదును చేశారు. గురువారం ఉదయం బోరు వేసేందుకు డ్రిల్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. దేవదాయ శాఖ భూమిలో మునీశ్వరుడికి పూజలు చేస్తున్న ఇరువారం గ్రామస్తులు వారిని అడ్డగించారు. దీంతో బోరు బండి ఆగింది. జేసీబీతో చదును ప్రక్రియ మాత్రం నిరవధికంగా సాగుతోంది.

లీజుకు తంత్రం.. ఆ అధికారి మంత్రం

దేవదాయశాఖ శాఖలో ఓ అధికారి అడుగుపెట్టినప్పటి నుంచి లీజు దందా కొనసాగుతోంది. తన సామాజిక వర్గం అని చెప్పుకుంటూ ఇప్పుడు కుర్చీల్లో అతుక్కుపోయారు. తన సామాజికవర్గానికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులకు ఏది అడిగినా కాదనకుండా చేసిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవదాయశాఖ భూములను కూడా అప్పన్నంగా కట్టబెట్టేందుకు లీజుకుతంత్రాన్ని నేర్పించి.. ఆ మంత్రానికి అధికారి బలాన్ని చేకూరుస్తున్నారని ఆ శాఖలోని పలువురు అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ అధికారి ఉన్నంత కాలం దేవదాయశాఖ భూములకు రక్షణ కరువై.. లీజు పేరుతో అమ్ముడు పోవడం ఖాయమని చెబుతున్నారు. సనాతన ధర్మమని నీతులు చెబుతూ.. ఇలా దేవుడి భూములకు ఎసరు పెట్టడం ఏమిటని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అర్చకుల మధ్య పోరు

ఈ దేవదాయశాఖ భూమి తమ అనుభవంలో ఉందని చెప్పుకుంటున్న ఆరుగురు అర్చకుల మధ్య పోరు నడుస్తోంది. పరిహారం వచ్చినప్పటి నుంచి వీరి మధ్య వివాదం రేగింది. అయితే భూమిని లీజు పేరుతో అడుగుతున్న ఆ ప్రజాప్రతినిధి ఇద్దరు అర్చకులను మాత్రం పిలిచి మాట్లాడడంతో.. మిగిలిన నలుగురు అర్చకులు గుర్రుమంటున్నారు. పోరును వదిలించుకోవడానికి ఇద్దరు అర్చకులు మాత్రం ఆ భూమి హక్కును చేతులు మార్చాలని పట్టుబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement