విశృంఖల పర్వం | - | Sakshi
Sakshi News home page

విశృంఖల పర్వం

Nov 7 2025 7:27 AM | Updated on Nov 7 2025 7:27 AM

విశృం

విశృంఖల పర్వం

గంటల తరబడి విద్యార్థినులపై ర్యాగింగ్‌ చేసినా పట్టించుకోని వర్సిటీ అధికారులు

ర్యాగింగ్‌ను ప్రోత్సహిస్తున్న అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకపోవడం దారుణం

ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన విద్యార్థులపైనే తిరిగి కేసులా..!

తాము వర్సిటీలో ఉండలేమంటూ బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రుల ఆవేదన

పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువ

తిరుపతి సిటీ: శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి ర్యాగింగ్‌ గ్రహణం పట్టింది. వర్సిటీ అధికారులు తమ నియంతృత్వ పోకడలతో విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు. వర్సిటీని గాడిన పెట్టాల్సిన ప్రభుత్వం సైతం చోద్యం చూస్తోంది. పీజీ సైకాలజీ విభాగంలో నూతనంగా ఫస్ట్‌ ఇయర్‌లో చేరిన జూనియర్‌ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. సైకాలజీ ప్రొఫెసర్‌ విశ్వనాథ్‌రెడ్డి ప్రోత్సాహంతో సీనియర్లు ఈనెల ఒకటో తేదీ నుంచి రెండురోజుల పాటు గంటల తరబడి నలుగురు విద్యార్థినులను ర్యాగింగ్‌లో భాగంగా వేధించారు. ఏమీ చేయలేని స్థితిలో ర్యాగింగ్‌ను భరించి వెంటనే వర్సిటీ రిజిస్ట్రార్‌, రెక్టార్‌కు విద్యార్థి సంఘాలతో కలసి విన్నవించారు. కానీ విచారిస్తున్నాం.. చర్యలు తీసుకుంటాం అంటూ విద్యార్థులను, బాధితులను అధికారులు మభ్యపెట్టి అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపైనా, సదరు ప్రొఫెసర్‌పైనా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి లోకం కన్నెర్రజేసింది. భారీఎత్తున వర్సిటీలో బాధిత విద్యా ర్థినులు, తల్లిదండ్రులతో కలసి ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దీంతో అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకపోగా.. గళం విప్పిన విద్యార్థి నాయకులపైనే కేసులు బనాయించారు.

అధ్యాపకున్ని సస్పెండ్‌ చేశాం

ఎస్వీయూలో ర్యాగింగ్‌ను ప్రోత్సహించినట్లు సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ్‌రెడ్డిపై అభియోగాలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్‌ చేశామని రిజిస్ట్రార్‌ భూపతినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో ర్యాగింగ్‌కు తావులేదని, వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఛరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు వర్సిటీలో తావులేదని చెప్పారు. ఘటనపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వర్సిటీ అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.

వర్సిటీలో పరిస్థితులు దారుణం

ఎస్వీయూలో అధికారుల తీరు దారుణంగా తయారైంది. ర్యాగింగ్‌కు గురైన మహిళా విద్యార్థుల తరఫున అధికారులకు ఫిర్యాదు చేశాం. దీంతో వర్సిటీ అధికారులు మాపై పోలీసులను ఉసిగొల్పి దాడులు చేశారు. ఓ ప్రొఫెసర్‌ ప్రోత్సాహంతో సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను అసభ్యకరంగా ర్యాగింగ్‌ చేసినా.. ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోకపోడం దారుణం. గళమెత్తిన మాపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎస్వీయూ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. – విద్యార్థి సంఘాల నాయకులు, ఎస్వీయూ

వీడియోలు తీశారు

ఎస్వీయూ సైకాలజీ విభాగాధిపతి ఆదేశాలతోనే సీనియర్లు మాతో గత శని, ఆదివారాల్లో ఇటు కళాశాలల్లోనూ అటు హాస్టల్‌లోనూ గంటల తరబడి డ్యాన్సులు వేయించి నరకం చూపించారు. సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుని పైశాచికానందం పొందారు. ఈ విషయంపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుంచి ప్రొఫెసర్‌ మాపై నిఘా ఉంచారు. మీకు అండగా ఉండే వారిపై కేసులు బనాయిస్తాం మీకు ఎవరు దిక్కువస్తారో చూస్తా అంటూ ఆ ప్రొఫెసర్‌ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకే ఇక్కడ మాకు భద్రత లేదని టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నాం.

– మీడియాతో మాట్లాడుతున్న బాధిత విద్యార్థినులు

టీసీలు ఇవ్వండి.. వెళ్లిపోతాం..

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎస్వీయూలో మా పిల్లలు సీటు సాధించారు. శ్రీవారి పాదాల చెంత చదివే భాగ్యం కలిగిందని సంతోషపడ్డాం. కానీ మా ఆశలు ఆవిరయ్యాయి. ఎస్వీయూలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాక్షాత్తు ప్రొఫెసర్‌ సీనియర్ల చేత ర్యాగింగ్‌ చేయించిన తీరు మమ్మల్ని కలచి వేసింది. ర్యాగింగ్‌పై అధికారులను నిలదీసినా వారి నుంచి స్పందనలేదు. దీంతో ఎస్వీయూలో మా పిల్లలకు భద్రత లేదు. అందుకే టీసీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. మా ఊర్లకు పిల్లలను తీసుకుని వెళ్లిపోతాం. – మీడియాతో ర్యాగింగ్‌కు గురైన

విద్యార్థినుల తల్లిదండ్రులు

విశృంఖల పర్వం1
1/1

విశృంఖల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement