బిల్లులు కడతారా.. విద్యుత్ కట్ చేయమంటారా?
పూతలపట్టు( యాదమరి ): ‘దళితులమనే కదా మాపై దాడులు చేస్తున్నారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ ఎలా నిలిపివేస్తారు?..’ అంటూ పూతలపట్టు దళితవాడ ప్రజలు ట్రాన్స్‌కో ఏఈ నరసింహులు తీరుపై విరుచుకుపడ్డారు. గురువారం మండల కేంద్రంలోని దళితవాడలో ట్రాన్స్‌కో ఏఈ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గృహ యజమానులకు ముందస్తు సమాచారం అందించకుండా విద్యుత్ కట్ చేశారు. 2012 నుంచి పాత విద్యుత్ బిల్లులు చెల్లించాలని హుకుం జారీ చేశారు. గత ప్రభుత్వం దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించిందని, అప్పుడు లేని ఈ దాడులు ఇప్పుడెందుకని మండిపడ్డారు. దీనిపై ఎలాంటి సమాచారం అందించకుండా దాడులు నిర్వహించి, ఎలా కరెంట్ తొలగిస్తారని ఏఈ నరసింహులును నిలదీశారు. తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం స్పందించిన ఏఈ వాయిదా పద్ధతుల్లో పాత బాకాయిలు చెల్లించాలని సూచించారు.


