విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
తిరుపతి రూరల్ : మోంథా తుపాను నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఈ క్రమంలోనే సెలవులను రద్దు చేశామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. ఆదివారం సదరన్ డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల ఇంజినీరింగ్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్తు సబ్ స్టేషన్లలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సెలవులు రద్దు చేసినట్టు వెల్లడించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు సీజీఎం స్థాయి అధికారులు ఒక్కో జిల్లాను మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని ఆదేశించారు.
‘పాపవినాశనం’లో గంగ పూజ
తిరుమల : తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పాపవినాశనం డ్యామ్ వద్ద టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు హారతి సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమన్నారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని, తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్‌ల నుంచి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే టీటీడీ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు.


