మోంథా ముప్పు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అల్పపీడన ప్రభావంతో ఇది వరకే వర్షాలు దడ పుట్టించాయి. అన్నదాతలను నిలువునా ముంచాయి. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాయి. గురువారానికి తెర వీడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీరా మళ్లీ మరో తుపాను ముంచుకొస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం మోంథా తుపానుగా రూపం దాల్చుకుంది. దీనివల్ల జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మోంథా తుపాను జిల్లాలో అన్నదాతలను ఆందోళనలోకి నెట్టేసింది. ఇది వరకు 178 హెక్టార్లకు వరి నష్టం కాగా..టమాట, కూరగాయల పంటలు, పండ్ల తోటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. ఈ తుపానుతో మళ్లీ పంటలకు నష్టం వాటిళ్లనుంది. దీనికి తోడు చెరువు కట్టలు పలుచోట్ల మరమ్మతులకు గురై తెగే ప్రమాదం ఉంది. వర్ష ప్రభావంతో జీడీ నెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, సోమల తదితర మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
పలమనేరులో భారీ వర్షం
జిల్లాలో శనివారం రాత్రి పలుచోట్ల వర్షం దంచికొట్టింది. పలమనేరులో అత్యధికంగా 69.0 మి.మీ వర్షం పడింది. సదుంలో 44.8, పెనుమూరులో 55.0, పూతలపట్టులో 50.0, సోమలలో 35.4, చౌడేపల్లిలో 41.4, గంగరంలో 37.6, తవణంపల్లిలో 27.4, గంగాధర నెల్లూరులో 39.2, చిత్తూరు అర్బన్‌లో 40.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి.


