తీర్పుపై ఉత్కంఠ! | - | Sakshi
Sakshi News home page

తీర్పుపై ఉత్కంఠ!

Oct 27 2025 8:38 AM | Updated on Oct 27 2025 8:38 AM

తీర్పుపై ఉత్కంఠ!

తీర్పుపై ఉత్కంఠ!

● నేడు కటారి దంపతుల హత్య కేసులో శిక్ష ఖరారు! ● ఇప్పటికే అయిదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు ● చిత్తూరు కోర్టు వద్ద భారీ బందోబస్తు

చిత్తూరు అర్బన్‌ : జిల్లా న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క చిత్తూరు వాసులే కాదు.. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోని కూటమి నాయకుల వరకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందోనని గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ జంట హత్యల కేసులో దోషులకు సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

2015.. నవంబరు 17వ తేదీ..

స్థలం – చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

సమయం – మధ్యాహ్నం 11.57 గంటలు

ఏం జరిగింది – మేయర్‌ సీటులో కూర్చుని ఉన్న కటారి అనురాధను పాయింట్‌ బ్లాక్‌లో తుపాకీతో కాల్చి చంపేసారు. పక్కనే కూర్చుని ఉన్న ఆమె భర్త కటారి మోహన్‌ను కత్తులతో వెంటాడి నరికేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడతున్న మోహన్‌ను చిత్తూరుకు ఆపై వేలూరుకు తరలించగా అక్కడి ఆసుపత్రిలో చనిపోయాడు.

చేసిందెవరంటే – ప్రధాన నిందితుడు, మోహన్‌ మేనల్లుడు చంద్రశేఖర్‌ అనే చింటూతో పాటు 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నేరం రుజువైంది వీరిపై ..

చింటూ, చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ (54), వెంకటాచలపతి (59), జయప్రకాష్‌రెడ్డి (32), మంజునాథ్‌ (36), వెంకటేష్‌ (48)పై నేరం రుజువైనట్లు చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్‌ ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. మిగిలినవారిపై కేసు కొట్టేసింది.

నిరూపించబడ్డ సెక్షన్లు

● 120 (బి) ఐపీసీ (హత్యకు కుట్ర) – అయిదుగురు

● అనురాధను హత్య చేసినందుకు సెక్షన్‌ 302 రెడ్‌విత్‌ సెక్షన్‌ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి

● మోహన్‌ను హత్య చేసినందుకు సెక్షన్‌ 302 రెడ్‌విత్‌ సెక్షన్‌ 120 బి (ఐపీసీ) – అయిదుగురికి

● వేలూరు సతీష్‌ కుమార్‌ నాయుడుపై హత్యాయత్నం చేసినందుకు సెక్షన్‌ 307 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్‌

● వేలూరు సతీష్‌కుమార్‌ నాయుడును నిందితులు ఒకే ఉద్దేశ్యంతో హత్యాయత్నం చేయడం సెక్షన్‌ 307 రెడ్‌విత్‌ సెక్షన్‌ 34 ఐపీసీ – చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, వెంకటేష్‌.

సతీష్‌కుమార్‌ నాయుడును చంపాలనే ఉద్దేశ్యంతో గాయపరచడం సెక్షన్‌ 302 ఐపీసీ – ముద్దాయి మంజునాథ్‌ .

పోలీసుల భారీ భద్రత

దోషులు అయిదుగురిని చిత్తూరు జిల్లా జైలు నుంచి ఉదయం 10 గంటలకు చిత్తూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, 80 మంది వరకు పోలీసులను కోర్టు ఆవరణలో భద్రత కోసం ఏర్పాటు చేశారు. కటారి కుటుంబ సభ్యులకు, సీకే బాబు ఇంటి వద్ద, ప్రధాన సాక్షుల ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement