ఖనిజం..లూటీ | - | Sakshi
Sakshi News home page

ఖనిజం..లూటీ

Oct 27 2025 8:38 AM | Updated on Oct 27 2025 8:38 AM

ఖనిజం..లూటీ

ఖనిజం..లూటీ

రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా రూ.కోట్లలో దోచుకుంటున్న ఖనిజ సంపద అక్రమార్జనకు రాచమార్గం ప్రభుత్వాదాయానికి భారీగా గండి తెరవెనుక సూత్రదారి ఆ అధికారేనా? పూతలపట్టు నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రానైట్‌ దందా

ఆ అధికారి అండదండలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పూతలపట్టు నియోజకవర్గంలో గ్రానైట్‌ క్వారీలకు పెట్టింది పేరు. ఇక్కడ లభిస్తున్న బ్లాక్‌ గ్రానైట్‌ ఖనిజం అత్యంత విలువైంది.దీంతో ఆర్థిక, సామాజిక, అర్థ బలం ఉన్న రాజకీయ నేతలతో పాటూ.. వ్యాపారవేత్తలు సైతం తీవ్రంగా పోటీ పడుతుంటారు. దీనికోసం పెద్ద స్థాయిలో లాబీయింగ్‌ చేస్తుంటారు. అనుమతి రాని వారు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి వాటిని చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ తరహాలోనే కొందరు కూటమి నేతలు అక్రమ క్వారీ పనులు చేస్తున్నారని పలు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

రూ.కోట్లలో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ..

పూతలపట్టు నియోజకవర్గంలోని 3 మండలాల్లో క్వారీ పనులు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు అనుమతుల పేరిట...ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో భాగంగానే యాదమరి మండలంలో దాదాపు 12 గ్రానైట్‌ నిక్షేపాలు ఉండగా వాటిలో 10 క్వారీల్లో పనులు సాగుతున్నాయి. వీటి నుంచి రోజుకు 30 లారీల్లో గ్రానైట్‌ బండలను పాలిషింగ్‌ కర్మాగారాలకు రవాణా చేస్తున్నారు. గ్రానైట్‌ తరలింపునకు సంబంధిత శాఖల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి ఇచ్చిన మేరకు కాకుండా అక్రమంగా రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. ఒక్కో లారీలో పెద్దవి అయితే రెండు, చిన్నవి అయితే 4 వరకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రోజుకు ఒక్క యాదమరి మండలం నుంచే రూ.20–30 లక్షల విలువ చేసే ఖనిజ సంపద తరలిపోతోంది. కాగా ఇక్కడ జరుగుతున్న క్వారీలు దాదాపుగా కూటమి నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయి. దాసరపల్లి వద్ద జరుగుతున్న అక్రమ క్వారీలో ఐదు నెలలుగా సుమారు రూ.25 కోట్లు విలువ చేసే ఖనిజం సరిహద్దులు దాటిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ అధికారి సహకారం ఉండడంతో ఈ తంతు జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇక పూతలపట్టులో అయితే 10 క్వారీలు గాను 3 చోట్ల అక్రమంగా తవ్వుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ టీడీపీ నేత ఈ దందాలో చేతులు తిరిగినట్లు ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక లీజుకు ఉన్న క్వారీ దారులు సైతం రాయల్టీలు కట్టకుండా ఖనిజానికి కన్నం వేస్తున్నారు. బంగారుపాళ్యంలో కూడా ఇదే తంతు నడుస్తోంది.

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు

దాసరపల్లిలో జరుగుతున్న అక్రమ క్వారీ విషయం సాక్షి కథనంతో గుట్టు రట్టు కావడంతో విజిలెన్స్‌ అధికారులు ఆ క్వారీని తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆ అక్రమ క్వారీ నిర్వాహకుడు ఎవరు..? ఎన్ని నెలలుగా చేస్తున్నాడు..? ఇందుకు సహకరిస్తున్న ఆ అధికారి ఎవరు..? మాముళ్లు ఏమైనా ఇస్తున్నారా..? గొల్లపల్లి క్వారీ పేరుతో ఎలా అక్రమ క్వారీలోని దిమ్మెలకు తరలింపులు చేస్తారు..? దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది? గ్రామస్తులు ప్రశ్నిస్తే..బెంగుళూరులోని ఓ టీడీపీ నేత బెదిరింపులు ఏంటీ అనే విషయంపై పూర్తిగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక యాదమరి మండల ప్రాంతంలోని ఓ క్వారీ అనుమతితో అటవీశాఖ భూముల్లో తవ్వకాలు చేస్తున్నట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఈ అక్రమాలకు సహకరిస్తూ..ప్రోత్సహిస్తున్న ఆ అధికారిపై త్వరలో వేటు పడే అవకాశాలున్నాయని శాఖలోని పలువురు చెబుతున్నారు.

అక్రమ గ్రానైట్‌ దందాను నిలువరించాల్సిన సంబంధిత శాఖాధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలకు తావిస్తోంది.మైనింగ్‌ శాఖలోని ఓ అధికారికి క్వారీ యాజమానుల నుంచి భారీ మొత్తంలో నెలవారీ ముడుపులు అందుతున్నాయని ఆ శాఖలోని కొందరు సిబ్బంది చెబుతున్న రహస్యం. ఎవరా అధికారి ? అతడి అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరుతున్న జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ అక్రమాలను నియంత్రించాల్సిన నిఘా వ్యవస్థ ఏమైనట్టు? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో అక్రమ గ్రానైట్‌ తరలింపుతో రూ. కోట్లలో ప్రభుత్వానికి నష్టం చేకూరింది. అయితే ఈ అక్రమ క్వారీయింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి కొందరు అధికారులు సాహసిస్తున్నా కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి ఆ అధికారులను నిలువరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement