ఏకపక్షం.. అధ్యక్షా!
ఏ ఉద్యోగ సంఘానికై నా నియమ, నిబంధనలు ఉంటాయి. ఏ సంఘమైనా వాటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, వెసులుబాటును అనుభవించేందుకు ఏళ్ల తరబడి ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ బైలాస్ ప్రకారం నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికలను అందుకు విరుద్ధంగా నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా వారందరిని బెదిరించి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల్లో వ్యతిరేకత
చూపుతున్న అదే సంఘం సభ్యులు (ఫైల్)
చిత్తూరు కలెక్టరేట్ : నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలను పక్కదారి పట్టించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్లు ప్రభుత్వ లెక్చరర్లు పెదవి విరుస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలను రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహించడంతో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరిగి ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని వెల్లడిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఓ జూనియర్ లెక్చరర్ 2014 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా అతడే కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తోంది.
అధ్యక్ష పదవికి మరికొందరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ అవకాశం కల్పించడం లేదని జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలు తనకు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి ఏకపక్షంగా ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారని ఆ సంఘం సభ్యులే పెదవి విరుస్తున్నారు. ఆ అధ్యక్షుడి అక్రమ వ్యవహారాలపై ఆ సంఘం సభ్యులు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానంను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర ఇంటర్మీడియట్
అధికారులు జోక్యం చేసుకోవాలి
అసంబద్ధంగా నిర్వహించిన ఎన్నికలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించి అవకతవకలను విచారించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలున్నాయంటూ రెచ్చిపోతున్న అధ్యక్షుడి వ్యవహార తీరుపై జిల్లాలోని లెక్చరర్‌లతో పాటు, పక్క జిల్లాల లెక్చరర్‌లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత స్వలాభం కోసం మాత్రమే రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలను నిర్వహించారని మండిపడుతున్నారు. చట్టబద్ధత లేని ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు . సమాజాల నమోదు చట్టం, సంఘం నియమావళి ప్రకారం తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.


