
గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దీపావళి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. అలాగే చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో సైతం గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు.
భార్య కాపురానికి రాలేదని..
యాదమరి: కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి పంచాయతీ, పావడదాసూరు గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు మునెప్ప(35) దినసరి కూలీ. కుటుంబ పోషణకు ఇతరుల నుంచి కొంత అప్పుగా తీసుకున్నాడు. అయితే వాటిని చెల్లించే క్రమంలో విఫలమవడంతో అప్పుల వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి వేధించేవారు. దీంతో అతని భార్య సౌజన్య ఆ అవమానాన్ని భరించలేక మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. తను ఎంతకీ తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన మునెప్ప ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని తల్లి చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునెప్ప మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
బంగారుపాళెం : మండలంలోని సంక్రాంతిపల్లె వద్ద ఆదివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ సంఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు, పలమనేరు వైపు నుంచి చిత్తూరు వెళ్తున్న కారు సంక్రాంతి పల్లె వద్ద కు రాగానే ఓ ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా అడ్డు రావడంతో ఎడమవైపు పోతున్న కారు.. యాదమరి నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ట్యాంకర్ రహదారిపై బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ట్యాంకర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో అందులో ఉన్న పెట్రోల్, డీజల్ లీకై ఎక్కడ మంటలు చెలరేగుతాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న బంగారుపాళెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారాన్ని ఐఓసీ సిబ్బందికి తెలియజేయడంతో వారు సంక్రాంతిపల్లె వద్దకు చేరుకున్నారు. బోల్తా పడిన ఆయిల్ ట్యాంక్ నుంచి మరో వాహనంలోకి డీజల్, పెట్రో ల్ నింపారు. రహదారిపై బోల్తా పడిన ట్యాంకర్‌ను క్రేన్ల సాయంతో రహదారి పక్కకు తొలగించారు. ట్యాంకర్ బోల్తా పడడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మా రింది. ట్యాంకర్‌కు మంటలు చెలరేగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు.