పూతలపట్టు(యాదమరి): ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. భాదితుల కథనం.. మండల పరిధిలోని, పి.కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో చిన్నపాపమ్మ నివాసం ఉంటోంది. తన కుమారుడైన దాము ఆర్మీలో పదవీ విరమణ చెంది తిరుపతిలోని ఓ సెక్యూరిటీ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఆమె తిరుపతిలో నివాసం ఉంటున్న తన కుమారుడు ఇంటికి వెళ్లింది. అయితే దీపావళి పండుగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన వీరికి తమ ఇంటి తలుపులు తెరచి ఉండడాన్ని గమనించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 60 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, రూ.50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్రణాలికతోనే దుండగులు రెక్కీ నిర్వహించి చొరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు.