
‘పాలారు’కు జలకళ
శాంతిపురం : ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి ఆ వరద నీటితో పాలారు నది మళ్లీ జలకళను సంతరించుకుంది. కర్ణాటకలోని బేతమంగళ డ్యాం గేట్లు ఎత్తడం, సువిశాలమైన రామసాగర చెరువు నుంచి మూడు రోజులుగా మొరవ నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో వి.కోట, రామకుప్పం మండలాల మీదుగా ప్రవహిస్తూ ఆదివారం తెల్లవారుజామున నీరు శాంతిపురం చేరాయి. ఇక్కడి నుంచి కుప్పం మండలం మీదుగా తమిళనాడుకు చేరనున్నాయి. స్థానికంగా భారీ వర్షాలు లేకపోయినా నదిలో నీటి రాకతో స్థానికులు శాంతిపురం చెక్ డ్యాం వద్దకు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఆదివారం బడుగుమాకులపల్లి వారపు సంత ఉండటం, దీని పక్కనే పాలారు నది ప్రవహించడంతో రోజంతా జనాల తాకిడి కనిపించింది. కాగా కర్ణాటక నుంచి వస్తున్న వరద నీటితో పాలారు నది ప్రవహిస్తుంటే సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాలువ ద్వారా తెచ్చిన కృష్ణా నది జలాలు ప్రవహిస్తున్నాయని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నిజంగా నీరు ఎక్కడి నుంచి వస్తోందో తెలిసిన వారు ఈ పోస్టులను చూసి నవ్వుకొంటున్నారు.