
ప్రమాదకరంగా చెరువు
చౌడేపల్లె : రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరదనీరు చేరుతోంది. దుర్గ సముద్రం పంచాయతీ పరిధిలోని బుటకపల్లె చెరువు సుమారు వంద ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ చెరువు నిండి మొరవ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువనున్న చిన్నపాటి కుంటలు, చెరువులు మొరవలు వెళ్లడంతో ఊహించని మేరకు వరద నీరు బుటకపల్లె చెరువుకు చేరుతోంది. చెరువు కట్ట మధ్యలో ఓ చోట మట్టి జారి కట్ట సగభాగం వరకు కోతకు గురై నీరు బయటకు వెళ్తోంది. మళ్లీ వర్షం కురిసినా లేదా వరద నీటి ఉదదృతి పెరిగితే కట్ట తెగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శెట్టిపేట పెద్ద చెరువుకు గండి పడింది. నీరు గండి ద్వారా బయటకు ప్రవహిస్తోంది. కట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయమైన రైతులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.