
వినోదం.. కావొద్దు విషాదం!
భారీ వర్షాలతో జోరుగా ప్రవహిస్తున్న వాటర్‌ఫాల్స్ ప్రమాదాలకు నిలయంగా పర్యాటక ప్రాంతాలు మూడు వాటర్‌ఫాల్స్‌లో ఎటుచూసినా మృత్యులోయలే ఇప్పటికి 14 మంది మృతి
పలమనేరు : సరదాగా స్నేహితులతో కలిసి కొంతమంది ప్రకృతి అందాలను వీక్షించి పరవశిస్తుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోష సాగరంలో మునిగి తేలుతుంటారు. సెలయేళ్లు, జలపాతాలు, వాటర్ ఫాల్స్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సెల్ఫీలు దిగుతూ.. ఫొటోలు తీసుకుంటూ సంబరపడి పోతుంటారు. ఇలాంటి సందర్భంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మొదలే వర్షాలు.. ఆపై రీల్స్.. సెల్ఫీల మోజులో పడి కన్నీళ్లు తెప్పించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
కన్నీటి ‘జలపాతం’!
నియోజకవర్గంలోని పలు వాటర్‌ఫాల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. భారీ సుడిగుండాలు పలువురిని బలితీసుకుంటున్నాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల, యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాలతో కై గల్ దుముకురాళ్ల, కళ్యాణరేవులు, గంగన్న శిరస్సు, వైఎస్‌ఆర్ జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. సుడిగుండాలతో ప్రమాదకరంగా మారిపోయాయి. ముఖ్యంగా కళ్యాణిరేవులు, కై గల్ వాటర్‌ఫాల్స్‌లోని మృత్యులోయ ఇప్పటికే పలువురిని పొట్టనబెట్టుకుంది. ఇక్కడి సుడిగుండం కారణంగా నీటిలోకి దిగితే మళ్లీ పైకి రావడం సులభం కాదు.
ఏడేళ్లలో 14 మంది మృతి
గత ఏడేళ్లలో పలమనేరు నియోజకవర్గంలోని కై గల్, కళ్యాణిరేవులు, గంగనశిరస్సు, వైఎస్సార్ జలాశయం, వీకోట మండలంలోని గిడుగు జలపాతాల్లో 14 మంది దకా నీళ్లల్లో మునిగి మృతి చెందారు. సంబంధిత జలపాతాల్లో సుడిగుండాలు, నదిలోపలి పరిస్థితులు తదితరాలు గురించి అవగాహన లేకనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యువత సెలవుల్లో సరదాగా గడిపేందుకు అడవిలోని కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అక్కడున్న ఫాల్స్‌లో దూకడం కూడా ప్రమాదాలకు కారణమే.

వినోదం.. కావొద్దు విషాదం!