
ఆగని దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. శనివారం తెల్లవారు జామున మండలంలోని పాతపేట, పూరేడువారిపల్లె చిట్టారెడ్డిపేట, పాళెం, కోటపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను నాశనం చేశాయి. పూరేడు వారిపల్లె వద్ద వరి పంటను తొక్కిపడేశాయి. అలాగే మామిడి కొమ్మలను విరిచేశాయి. దాదాపు ఏడు ఏనుగులు పంటలపై పడి సర్వనాశనం చేశాయి.
చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కుప్పంరూరల్: చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం మండలం, డి.కె.పల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. కుప్పం సీఐ శంకరయ్య మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి చెరువులో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి సమాచారం ఇచ్చారని తెలిపారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మెరూన్ కలర్‌పై తెల్లటి చారల షర్టు ధరించి, బట్ట తల కలిగి ఉన్నాడని, ఎవరైన ఇలాంటి ఆనవాళ్లు కలిగిన వ్యక్తి కనబడక పోయి ఉంటే కుప్పం పోలీసులను సంప్రదించాలని సూచించారు.
నేడు జిల్లా కార్యవర్గ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ తదితర సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు.

ఆగని దాడులు