
బైక్‌ను ఢీకొట్టిన కారు
శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో శాంతిపురంలోని పాలారు వంతెన వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వడ్డెర వెంకట్రామప్ప, సత్యప్పలు చికెన్ షాపుల ఎదుట ఉన్న ఇనుప సామాన్ల కొలిమిలో తమ పని ముగించుకుని బైకుపై వెనుదిరిగారు. వెనుక నుంచి వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టడంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్రామప్ప(57) అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు ఉన్న సత్యప్ప(59) తీవ్రంగా గాయపడ్డాడు. 108 ద్వారా సత్యప్పను కుప్పం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును సమీపంలో వదిలేసి, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఈ కారులో మద్యం బాటిళ్లను గుర్తించిన కెనమాకులపల్లి వాసులు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నిరసనకారులతో ఆందోళన విరమింపజేశారు.