
ప్రాజెక్టులపై కినుక !
● గత ప్రభుత్వంలో ఎక్కడ ఆగాయో అక్కడే పనులు ● అసంపూర్తి ప్రాజెక్టు పనులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 200 వందల ఎంసీఎఫ్‌టీ నీటిని ఒడిసిపట్టలేని వైనం ● ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హామీ విస్మరించిన చంద్రబాబు ● గత ఎన్నికల హామీ గాలికొదిలేసిన ప్రభుత్వం
వర్షం నీరు సముద్రంపాలు
వెంగంవారిపల్లి అడవిలో ప్రవహిస్తున్న నది
పలమనేరు : జిల్లాలోని పడమటి ప్రాంతమైన పలమనేరులో సాగు, తాగునీటికి బోర్లపైన ఆధార పడాల్సిందే. వర్షాలు కురిసినప్పుడు చిన్న నదులు ప్రవహిస్తుంటాయి. అయితే ఆ నీటిని వడిసిపట్టే ప్రయత్నాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కౌండిన్య నదిపై కాలువపల్లి వద్ద వైఎస్‌ఆర్ హయాంలో జలాశయాన్ని నిర్మించారు. ఆపై వచ్చిన కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబు సర్కార్ మిగిలిన ప్రాజెక్టుల విషయాన్ని గాలికొదిలేశాయి. గత ఎన్నికల్లో పలమనేరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సైతం కూటమి అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాని ప్రాజెక్టుల పరిస్థితి నేటికీ ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది.
పలమనేరు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఇక్కడి నదులు ప్రవహించినప్పుడల్లా నీరు వృథాగా పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని మోర్థానా ప్రాజెక్టుకు చేరుతోంది. దీన్ని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు రంగం సిద్ధం చేసింది. అయితే అప్పట్లో కోవిడ్, తదుపరి ఎన్నికల కారణంగా ఈ పనులు వివిధ ధశల్లో ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమైనట్టే.
3 ప్రాజెక్టుల నిర్మాణాలకు
గత ప్రభుత్వంలో చర్యలు
ప్రాజెక్టుల నిర్మాణంపై గత ప్రభుత్వంలో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిపై రూ.22 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. దీనికి భూసేకరణకు అవసరమైన చెల్లింపులు జరిగి టెండర్ల ప్రకియలో పనులు ఆగాయి. వీకోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు రూ.46.82 కోట్ల అంచనాలను గతంలోనే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. పలమనేరు మండలంలోని గంగన్నశిరస్సు ప్రాజెక్టు పనులు గతంలో మొదలై అర్థంతరంగా ఆగాయి. అయితే దీనిపై స్థానిక ఇరిగేషన్‌శాఖ రూ.27.37 కోట్ల కొత్త అంచనాలతో పబ్లిక్‌హెల్త్ శాఖకు పంపింది. అయితే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతున్నందున ప్రాజెక్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇక బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి నది విషయం కనీసం ఇరిగేషన్ శాఖకు కూడా తెలియదు. మొత్తం మీద ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే గంగనశిరస్సు ప్రాజెక్టులో 55 ఎంసీఎఫ్‌టీ, కై గల్ రిజర్వాయర్ ద్వారా 45.27 టీఎంసీ, దుర్గమ్మ ఏరు ప్రాజెక్టు ద్వారా 56 , వెంగంవారిపల్లి 40 ఎంసీఎఫ్‌టీ మొత్తం ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 200 ఎంసీఎఫ్‌టీ దాకా నీటిని ఒడిసిపట్టినట్టే. దీంతో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి.
కూటమి హామీ ఇచ్చింది.. వదిలేసింది..
గత ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సైతం ఈ ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వీటి గురించి పట్టించుకోలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పను లు ఎక్కడ ఆగాయో ఇప్పటికే అక్కడే ఉన్నాయి.
జోరుగా ప్రవహిస్తున్న కౌండిన్య నది
వీకోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రవహిస్తున్న దృశ్యం
పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కై గల్, దుర్గమ్మఏరు, వెంగంవారిపల్లి నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదుల ప్రవహించినప్పుడు 150 నుంచి 200 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రంలోని మోర్థనా ప్రాజెక్టుకు చేరి ఆపై బంగాళాఖాతంలో కలుస్తోంది. అయితే కౌండిన్య నదిపై రూ.55 కోట్ల వ్యయంతో పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీంతో 50 ఎంసీఎఫ్‌టీల నీటిని ఇక్కడ నిలుబెట్టుకోగలిగాం. ప్రస్తుతం నదులకు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిలో ప్రస్తుతం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు కౌండిన్య నదిలో చేరి తమిళనాడులోని మోర్ధనా డ్యామ్‌కు వృథాగా వెళుతున్నాయి. అదే విధంగా పలమనేరు మండలంలోని ఎరగినేరి నది నీళ్లు సైతం తమిళనాడుకు చేరుతున్నాయి. వీకోట మండలంలోని దుర్గమ్మ ఏటి నీరు తమిళనాడుకే ఉపయోగపడుతున్నాయి. బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి అడవి లోని మరో నది ఇలా ఈ ప్రాంతంలోని అన్ని నదుల నుంచి ఏటా 200 ఎంసీఎఫ్‌టీ నీరు సముద్రం పాలవుతోంది.
ప్రభుత్వానికి రివైజ్డ్ అంచనాలు
పంపించాం
గంగన్న శిరస్సు ప్రాజెక్టు పనులకు అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. కై గల్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉన్నాయి. దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు ఆర్థికశాఖ క్లియరెన్స్ రావాల్సి ఉంది. రెండు ప్రాజెక్టులకు రివైజ్డ్ అంచనాలతో ఇటీవలే అంచనాలను పెంచి ప్రభుత్వానికి పంపించాం. ఈ ప్రాజెక్టు పనులు త్వరగా మొదలుపెట్టేందుకు అవసరమైన ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం.
– లక్ష్మీనారాయణ, నీటిపారుదల శాఖ జేఈ

ప్రాజెక్టులపై కినుక !

ప్రాజెక్టులపై కినుక !