
పరిశ్రమల స్థాపనకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలోని వ్యవసాయదారులకు సహాయ సహకారాలను అందించని మూడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల కేటాయింపులకు అవసరమైన భూ కేటా యింపులు త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పరిశ్రమలకు దారి ఏర్పాటు చేసేలా హైవే శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2025–26వ సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 1,551 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో రూ.22 కోట్ల ఉత్పత్తి ప్రారంభించి 6,577 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. త్వరలో 3,663 కోట్ల పెట్టుబడులతో 52 భారీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, జెడ్‌ఎం సుబ్బారావు, ఎల్‌డీఎం హరీష్, పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి కట్టమంచి బాబి పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే తొలి టాటా నెర్వ్ కేంద్రం జిల్లాలో..
రాష్ట్రంలోనే తొలి టాటా నెర్వ్ కేంద్రం జిల్లాలోని కుప్పంలో ప్రారంభించడం జరిగిందని, త్వరలో జిల్లా మొత్తం అమలు చేసేలా చర్యలు చేపడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంజీవని హెల్త్‌కేర్ ప్రాజెక్ట్ అమలుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం కుప్పం నియోజకవర్గంలో అమలు చేశామన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుధారాణి, డీపీఎంవో ప్రవీణ్, చిత్తూరు నియోజకవర్గం అధికారి డాక్టర్ అనూష పాల్గొన్నారు.
పర్యాటక అభివృద్ధికి పటిష్ట చర్యలు
జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాను పర్యాటకరంగంలో ముందంజలో ఉండేలా సంబంధిత శాఖల అధికారు లు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.
నగదు జమకాకపోతే ఆందోళన వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు సబ్సిడీ నగదు జమకాకపోతే ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ సబ్సిడీ కచ్చితంగా చేరుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మామిడి సబ్సిడీ నగదు జమ అంశంపై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతుల ఖాతాల్లో రూ.146.84 కోట్లు సబ్సిడీ నగదు ను జమ చేశామన్నారు. ఎవరికై నా టెక్నికల్ సమస్య కారణంగా నగదు జమకాకపోతే ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. అగ్రికల్చర్ అధికారులను సంప్రదిస్తే సబ్సిడీ నగదు జమ చేసేందుకు చర్యలు చేపడతారన్నారు. జమ చేసిన సబ్సిడీ నగదులో బంగారుపాళెం మండలానికి చెందిన ఇద్దరు రైతులకు ఎక్కువ మొత్తం సబ్సిడీ జమ అయ్యిందన్నారు. జిల్లాలో 20 వేల మంది రైతులకు రూ.లక్షకు మించి సబ్సిడీ జమ అయినట్లు తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కచ్చితమైన సబ్సిడీ నిర్ధారించామన్నారు. అర్హత కలిగి నగదు జమ కాని రైతుల నుంచి అక్టోబర్ 30 వ తేదీ వరకు వినతులు స్వీకరించి సబ్సిడీ జమ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రైతుల నుంచి వచ్చే అర్జీలను 48 గంటల్లోపు పునఃపరిశీలన చేసి నిర్ధారిస్తామన్నారు. రూ.5 లక్షలకు మించి సబ్సిడీ అందే రైతులు జిల్లాలో 21 మంది ఉన్నారని, వీరి అర్హతను మరింతగా పరిశీలించి నగదు జమ చేస్తామన్నారు.
ఆ మూడు ఫ్యాక్టరీలకు ఎలాంటి సహకారాలు ఉండవ్!
మామిడి రైతులకు సహకరించని మూడు ఫ్యాక్టరీలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని గుడిపాల, పుంగనూరు, బంగారుపాళెంలో ఉండే మూడు ఫ్యాక్టరీలు మామిడి రైతులకు సహాయ సహకారాలు అందించడంలో విఫలమయ్యాయన్నారు. ఆ మూడు ఫ్యాక్టరీలకు ప్రభు త్వం తరఫున వచ్చే ప్రోత్సాహకాలను అందించడం జరగదని స్పష్టం చేశారు. జిల్లా హార్టికల్చర్ శాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.