
కూటమి భూమాయ!
టీడీపీ సానుభూతి పరులకే భూములు! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలిక్కి తెచ్చిన వైనం టీడీపీ అధికారంలోకి రావడంతో తారుమారు అధికారుల చుట్టూ ఎస్సీ, ఎస్టీలు ప్రదక్షిణలు భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆందోళన
విజయపురం : వారంతా నిరుపేద కుటుంబానికి చెందినవారు. రోజు కూలికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితి. సొంతంగా సెంటు భూమి లేని నిరుపేదలు. తమ బతుకులు మార్చడానికి ఏ మహాత్ముడైనా రాకపోడా అని ఎదురు చూస్తున్న సమయంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సెంటు భూమి లేని ప్రతి కుటుంబానికి పథకంలో భూములు ఇచ్చారు. ఇలా పన్నూరు దళతవాడ, ఆది ఆంధ్రవాడ, బీసీ కాలనీకి చెందిన 200 కుటుంబాలకు జగన్నాథపురం లెక్క దాఖలో ఒక్కో కుటుంబానికి 1.50 ఎకరాలకు పట్టారు ఇచ్చారు. తమకు ఇచ్చిన భూముల్లో ఏటా పంట పండించుకొని హాయిగా బతుకుదామని ఆశ పడ్డారు. అయితే ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం అనంతరం వారి ఆశలు ఆడియాశగా మారాయి. ఆపై వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఈ అంశాన్ని మరుగున పడేశాయి. లబ్ధిదారులకు తమ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
గత ప్రభుత్వంలో మరుగున పడ్డ వీరి సమస్యను ఆరా తీసి, ఆ ఫైళ్లకు బూజు దులిపి, గుట్టలుగా ఉన్న స్థలాలకు ఒక రూపురేఖకు తెచ్చి సమస్య పరిష్కారం దిశగా కొలిక్కి తెచ్చారు. తీరా భూములు చూపే సమయంలో అధికారం మారడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. భూకేటాయింపులో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పచ్చ కండువా వేసుకున్న వారికి, పచ్చనోటు చూపే వారికి మాత్రమే స్థలాలు చూపుతున్నారు. భూములు లేక, ఆర్థికంగా కుంగిపోయిన పేదలు భూములు ఎక్కడున్నాయో చూపాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి భూములు ఎక్కడ ఉన్నాయో ఇంత వరకు తెలియక ఆందోళనకు గురవుతూ తమ ఆగ్రహాన్ని అధికారుల వద్ద వ్యక్తం చేస్తున్నారు.
ముడుపులు ఇస్తేనే పనులు ..
విజయపురం మండలంలో భూ సమస్య తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకోవాలంటే రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఎంత ఎక్కువ మొత్తంలో ముడుపులు ఇస్తే పనులు అంత తొందరగా పరిష్కారం అవుతాయి. లేకుంటే ఎన్నేళ్లైనా ఆ సమస్య పరిష్కారం కాదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు రైతులు రూ.10 వేలు నుంచి 50 వేల వరకు ఇచ్చుకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.