
కొండను పిండేస్తున్నారు!
ప్రభుత్వ భూమిలో మట్టి తరలింపు నిద్రావస్థలో రెవెన్యూ, మైనింగ్‌శాఖ
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారుల అలసత్వం, ప్రభుత్వం ఉదాసీనత అక్రమార్కులకు వరంగా మారింది. అహ్లాదాన్ని పంచిపెట్టే కొండగుట్టలను నిత్యం జేసీబీలు, హిటాచీలుతో మట్టిని తరలిస్తున్నారు. ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన సంబంధిత రెవెన్యూ, మైనింగ్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
బంగారుపాళెం మండలంలోని గుండ్లకట్టమంచి రెవెన్యూ, చీకూరు పల్లె పంచాయతీలోని తంబుగానిపల్లె రహదారి సమీపంలో ప్రభుత్వం ఆదీనంలో గుట్ట ఉంది. ఈ గుట్టను హిటాచీతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు.జాతీయ రహదారి నుంచి చూస్తే ఈ గుట్ట కనిపిస్తుంది.బంగారుపాళెం మండలంలోని కేజీ సత్రం గ్రామానికి చెందిన ఓ రైతు తిరుపతికి చెందిన వ్యక్తులకు పెట్రోల్ బంక్ నిర్వహించేందుకు స్థలాన్ని లీజుకు ఇచ్చారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ స్థలానికి సమీపంలోని గుట్టను తవ్వి రెండు రోజులుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్న స్ధలంలో మట్టి నింపి చదును చేస్తున్నారు. సుమారు వెయ్యి లోడ్ల మట్టి అవసరమవుతోంది. ప్రభుత్వ స్థలాల్లో మట్టిని తరలించుకోవాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాల్సింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకు మట్టిని తరలించాల్సి ఉంటుంది. గుట్టను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయాన్ని సంబంధిత తహసీల్దార్, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ భూములకు పరిరక్షకులుగా ఉంటున్న రెవెన్యూ అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించుకుంటూ పోతే ప్రకృతి సంపద అంతరించే ప్రమాదం లేకపోలేదని స్థానికులు అంటున్నారు.