
రూ.20 లక్షలు చోరీ
నగరి: పట్టణ పరిధిలోని ఏకాంబరకుప్పం గ్రామంలో తాళాలు వేసిన ఓ ఇంట్లో సుమారు రూ.20 లక్షల భారీ చోరీ జరిగింది. స్థానిక సీఐ విక్రమ్ కథనం మేరకు.. ఏకాంబరకుప్పం గ్రామంలో విద్యుత్ శాఖ ఉద్యోగి నీలకంఠం నివాసం ఉంటున్నాడు. ఈనెల 10వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అత్తిమంజేరిపేటలో బంధువుల రిసెప్షన్‌కు వెళ్లాడు. 11వ తేదీన ఇంటికి రాగా ఇంట్లో దొంగలు పడ్డట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి అందులోని 174 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించినట్లు గుర్తించాడు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని నీలకంఠం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో
తొమ్మిది గొర్రెలు మృతి
ఐరాల: మండలంలోని చిగరపల్లెలో విద్యుత్ షాక్ తో తొమ్మిది గొర్రెలు మృతిచెందాయి. వివరాలి లా ఉన్నాయి.. చిగరపల్లెకు చెందిన ఏసు గొర్రెల ను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్‌లో రోజూలాగే శనివారం రాత్రి తన గొర్రెలను ఉంచి, ఇంటికి వెళ్లిపోయాడు. షెడ్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తెగి పడడంతో షెడ్ చుట్టూ వేసిన ఇనుప కంచెకు తగిలింది. ఆ వైరు ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై షెడ్డులో ఉన్న తొమ్మిది గొర్రెలు మృతి చెందాయి. ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి గొర్రెలు మృతిచెంది ఉండడంతో బోరున విలపించాడు. జీవనాధారం కోల్పోయానని ఏసు కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతి చెందిన గొర్రెలకు మద్దిపట్లపల్లె పశువైద్యాధికారి పినాకపాణి పోస్టుమార్టం చేశారు.
లారీ ఢీకొని
యువకుడి మృతి
పుంగనూరు: పట్టణ సమీపంలోని బైపాస్ సర్కిల్‌లో ఆదివారం బైక్‌ను లారీ ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం షాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు జమీర్(24) ద్విచక్ర వాహనంలో పంజాణికి వెళుతున్నాడు. పుంగనూరు బైపాస్ సర్కిల్‌లో అతివేగంగా వచ్చిన ఐచర్ లారీ ఢీకొంది. దీంతో జమీర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో కారులో వెళ్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, కృష్ణమూర్తి ప్రమాదాన్ని గమనించి కారును ఆపారు. బాధితుడికి ప్రథమ చికిత్స చేయించి, 108లో ఆస్పత్రికి తరలించారు. అతను మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రూ.20 లక్షలు చోరీ