
నియామక పత్రాల జారీ
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ కొత్త టీచర్ల నియామకానికి సమయం ఆసన్నమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,394 మంది సోమవారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న గురువులు సామాజిక, నైతిక విలువలతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేసి పిల్లల అభివృద్ధి, సర్కారు బడుల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొంటున్నారు. ఈ మేరకు కొత్త టీచర్లకు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డీఈఓ వరలక్ష్మి చేతుల మీదుగా శనివారం నియామకపత్రాలు అందజేశారు.
రైలు కింద పడి వృద్ధుడి మృతి
పుత్తూరు: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకొంది. రైల్వే ఎస్‌ఐ మధు కథనం మేరకు.. పుత్తూరు మండల పరిధిలోని ఎగువ తిరుమలకుప్పం గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు(77) తిరుపతికి వెళ్లడానికి స్థానిక రైల్వే స్టేషన్‌కు రామారావు కాలనీ నుంచి అడ్డదారిలో బయల్దేరాడు. ప్రమాదవశాత్తు కన్యాకుమారి వెళ్లే వివేక్ ఎక్స్‌ప్రెస్ కింద పడి మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిరుత సంచారంపై అప్రమత్తమైన అధికారులు
తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచారంపై వీసీ ఆచార్య నర్సింగరావు విశ్వవిద్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ పరిసరాల్లో ఆయన పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు, ఆ ప్రాంతంలో తిరిగే వారికి తెలిసేలా బారికేడ్లను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అభిషేక సింహాసనం బహూకరణ
చంద్రగిరి : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి దాతలు అభిషేక సింహాసనాన్ని బహూకరించారు. శనివారం ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి అందజేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకు చెందిన మదన్ మోహన్ రెడ్డి, యువజ్యోతి దంపతులు స్వామి వారికి కై ంకర్యాలను నిర్వహించేందుకు అభిషేక సింహాసనం అవసరమని తెలుసుకుని, అభిషేక సింహాసనాన్ని రూ.9 లక్షల వ్యయంతో తయారు చేయించారు. అనంతరం వాటిని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.