
వరద బాధితులకు అన్నదానం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని నీవానది ప్రాంతంలోకి వరదనీళ్లు రావడంతో అక్కడి కాలనీ వాసులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి అన్నదానం చేశారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అల్తాఫ్ ఆధ్వర్యంలో అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వరద బాధితులతో విజయానందరెడ్డి మాట్లాడి వాళ్ల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వరద నీళ్లు ఇళ్లలోకి రాకుండా తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని పలువురు విజయానందరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా నీవానది పరివాహక ప్రాంతంలో ప్రహరీ నిర్మించాలన్నారు. ఏడాదిన్నరలో ఇప్పటికే రెండు మార్లు వరదనీళ్లు ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయన్నారు. ఎమ్మెల్యే తన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వెంకటేష్, నవాజ్, మురుగదాస్, గౌస్‌ఖాన్, నిజాం, గఫార్, రియాజ్ పాల్గొన్నారు. కాగా అన్నదానం కూడా చేయనీకుండా పలువురు పోలీసులు అక్కడి నుంచి పంపించేయడం గమనార్హం.