
అంబేడ్కర్ భిక్షతోనే మనందరికీ పదవులు
వెదురుకుప్పం: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పెట్టిన భిక్షతోనే మనమందరం ఎమ్మెల్యేలు, మంత్రులుగా పదవిలో కొనసాగుతున్నామని హోం మంత్రి అనిత అన్నారు. శనివారం వెదురుకుప్పం మండలంలోని దేవళంపేట గ్రామంలో పర్యటించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్‌కు జరిగిన అవమానం జాతికందరికీ జరిగినట్టేనన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక ఇలాంటి కుయుక్తులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నట్లు చెప్పారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు థామస్, మురళీమోహన్, ఎంఎస్‌రాజు, మాజీ ఎంపీటీసీ మోహన్‌మురళి పాల్గొన్నారు.