
చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
● రూ.28 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర నేరస్తుడు హెచ్.హనుమంతప్ప (27)ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు రూ.28 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏఆర్ పోలీసు కార్యాలయంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, టూటౌన్ సీఐ నెట్టికంటయ్య, ఎస్‌ఐ రమేష్‌తో కలిసి మీడి యాకు వివరాలను వెల్లడించారు. గతనెల 30న నగరంలోని రామ్‌నగర్ కాలనీకు చెందిన అల్తాఫ్ అనే వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టి.. ఇంట్లో ఉన్న 150 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని చిత్తూరు–కాణిపాకం బైపా స్ వద్ద కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన హను మంతప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చిత్తూరులో జరిగిన చోరీతో పాటు అనంతపురంలోని ఓ ఇంట్లో 60 గ్రాము ల బంగారు, రూ.2 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనం కూడా తానే చోరీ చేసినట్లు నిందితు డు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ.25 లక్షల విలువచేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి హాజరుపరచగా, రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.
మహిళ అదృశ్యంపై కేసు
పుంగనూరు: మండలంలోని నెక్కుంది గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అదృశ్యమైంది. శుక్రవారం భర్త ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేదని , తన భార్య అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పనితీరును పర్యవేక్షించండి
చిత్తూరు కలెక్టరేట్ : మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి పనుల పనితీరును కచ్చితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్‌లోపు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో నిర్వహిస్తున్న పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. నవంబర్‌లోపు జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయకుమార్, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు