పీహెచ్‌సీలకు సుస్తీ.. సేవలకు స్వస్తి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలకు సుస్తీ.. సేవలకు స్వస్తి

Oct 13 2025 7:28 AM | Updated on Oct 13 2025 7:28 AM

పీహెచ్‌సీలకు సుస్తీ.. సేవలకు స్వస్తి

పీహెచ్‌సీలకు సుస్తీ.. సేవలకు స్వస్తి

కూటమి పాలనలో పడకేసిన వైద్యం

పీహెచ్‌సీల్లో నిలిచిన ఆరోగ్య సేవలు

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

అవస్థల్లో సామాన్య జనం

పట్టించుకోని పాలకులు

ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యం అలుముకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు పడకేశాయి. డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో సేవలు నిలిచిపోయాయి. దీనికి తోడు ఆరోగ్య శ్రీసేవలు ఆగిపోయాయి. పేరుకు పోయిన బకాయిల దెబ్బకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో ప్రభుత్వ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. సర్కారు వైద్యం నిర్వీర్యం కావడంతో సామాన్య జనం ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 సీహెచ్‌సీలు, 4 ఏరియా ఆసుపత్రులు, 15 యూపీహెచ్‌సీలు, ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పనిచేస్తున్నా యి. ఇందులో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం రెండు వారాలుగా విధులు బహిష్కరించి సమ్మె బాటపట్టారు. దీంతో వైద్యసేవలు పేదలకు దూరం అయ్యాయి.

నాడీపట్టే నాథుడే లేరు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 60 మందికి పైగా వైద్యుల సమ్మె చేస్తుండటంతో చికిత్స చేసేవారు కరువయ్యారు. దీంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల నుంచి వైద్యులు, పీజీ వైద్యులను సర్దుబాటు చేశారు. ఈ సర్ధుబాటు కారణంగా వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సన్నగిల్లాయి. ఇతర సేవలు సైతం స్తంభించాయి. అలాగే పీహెచ్‌సీల్లో కూడా చాలా చోట్ల వైద్య సేవలు మొ క్కు బడిగా అందుతున్నాయి. కొన్ని చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేక రోగులు చికిత్స కోసం వచ్చి వెనుదిరుగుతున్నారు.

మందుబిల్లలతో సరిపెడుతూ..

చిన్న రోగాలకు ఫార్మసిస్టులు, నర్సులు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. వైద్యుల సమ్మెతో 104 సేవలకు జ్వరమొచ్చింది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో పల్లె జనం చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారు. మందు బిల్లలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

జిల్లా ఆస్పత్రుల్లో కొరవడిన సేవలు

చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పూర్తిగా కొరవడ్డాయి. ఇక్కడ ప్రధానంగా డాక్టర్ల కొరత వేధిస్తోంది. స్టాఫ్‌ నర్సులు, హెడ్‌ నర్సులు, పలు టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, జీడీఏ తదితర పోస్టుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై అదనపు పనిభారం మోపుతున్నారు. ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. తద్వారా వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. మధ్యాహ్నానికే పలు సేవలు పరిమితమవుతున్నాయి. దీంతో ప్రజలు వైద్యం కోసం తిప్పలు పడుతున్నారు. ఇదే మాదిరిగానే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో సమస్యలు వేధిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బకాయిల భారం...

జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు శుక్రవారం నుంచి సమ్మె ప్రారంభించాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తప్పనిసరై వారు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా జిల్లాలోని పలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో కొన్ని ఆసుపత్రులు రోగులకు అత్యవసర వైద్యం అందించేందుకు తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తున్నా ఆరోగ్యశ్రీలో నమోదు చేయడం లేదు. అడ్మిషన్‌ అవసరమైన వారికి ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నాయి. తర్వాత ఆపరేషన్‌ చేయాలనుకున్న వారికి మళ్లీ రావాలని వెనక్కి పంపిస్తున్నారు. రూ. వందల కోట్లల్లో పేరుకు పోయిన బకాయిలను చెల్లించే వరకు బంద్‌ వీడబోమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పేదలు కార్పొరేట్‌ వైద్యానికి తిప్పలు పడుతున్నారు. వైద్యం విషయంలో పేద ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement