
కట్టమంచి.. ప్రమాదం పొంచి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ప్రసిద్ధి గాంచిన కట్టమంచి చెరువు సుందరీకరణకు తొలి అడుగు అంటూ గత ఏడాది సెప్టెంబర్ 24న కూటమి నేతలు హంగామా చేసి భూమి పూజ చేశారు. సుందరీకరణ చేపడుతున్నామంటూ ప్రజలను ఏమార్చారు. రోజులు గడిచే కొద్ది కట్ట మంచి చెరువులో జరిగే అభివృద్ధి ఏమిటనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యింది. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండు, రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో కట్టమంచి చెరువు ఉండటంతో అటు వైపుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కూటమి నేతలు జరిపిన అక్రమ మట్టి తవ్వకాలను చూసి ఆశ్చర్యపోయారు. పొక్లయిన్, జేసీబీలతో యథేచ్ఛగా మట్టిని తవ్వి ఆ చెరువు తల్లికి తీరని శోకం నింపారు. ఎక్కువ లోతు మట్టిని తవ్వితే ప్రమాదం జరుగుతుందనే ఆలోచన కూడా లేకుండా వందల లోడ్ల మట్టిని అక్రమంగా తరలించి జేబులు నింపుకున్నారు. కూటమి నాయకులు చేపట్టిన పనులు సుందరీకరణగా లేకపోయినప్పటికీ కట్ట మంచి చెరువు ను డేంజర్ జోన్‌లోకి నెట్టేసింది.
చెరువు కట్టలకు ప్రమాదం
కట్ట మంచి చెరువులో ఎక్కువగా మట్టి తవ్వడం వల్ల కట్ట బలహీనపడే అవకాశాలున్నట్లు నగరవాసులు భయాందోళనకు లోనవుతున్నారు. భవిష్యత్తులో ఎక్కువ వర్షాలు కురిస్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఆందోళన చెందుతున్నారు. ఇష్టానుసారంగా అధిక స్థాయిలో మట్టిని తవ్వడం వల్ల కట్టమంచి చెరువులో భూగర్భ జలాల రీచార్జ్ సరిగ్గా జరగదని నిపుణులు వెల్లడిస్తున్నారు. బోర్లల్లో సైతం నీటి స్థాయి తగ్గుతుందని చెబుతున్నారు. మట్టిని ఎక్కువ లోతు తవ్వడంతో చెరువు సహజ జీవావరణం మారిపోతుంది. చెరువు భూమి కింద ఉన్న రాతి పొరలు బయపడి భూమి ఉత్పాదకత తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చెరువులో అనియంత్రితంగా మట్టిని తవ్వడం వల్ల తాత్కాలిక లాభం కంటే దీర్ఘకాల నష్టాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అధిక వర్షాలు కురిస్తే కట్ట మంచి చెరువుకు సమీపంలో ఉండే ఆర్టీసీ బస్టాండు, సమీపంలో ఉండే కట్టమంచితో పాటు మరికొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
సంరక్షణ శూన్యం
చెరువు సంరక్షణకు చర్యలు చేపట్టాల్సింది పోయి సుందరీకరణ పేరుతో మట్టిని అక్రమంగా తవ్వేశారు. అక్రమమట్టి తవ్వకాల వల్ల చెరువుకు చుట్టూ ఉన్న పెన్సింగ్ దెబ్బతింది. చెరువుకు సమీపంలో నిర్మించిన కాలువ కుంగిపోయింది. పలు చోట్ల పగుళ్లు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. మట్టి లోతు 1 నుంచి 1.5 మీటర్ల వరకు మాత్రమే తొలగించాల్సి ఉంటే అంతకంటే ఎక్కువ లోతుకు తవ్వేశారు. దీంతో కట్టమంచి చెరువు సహజ రూపురేఖలు మారిపోయాయి. చెరువులోకి వచ్చే నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయకుండా అనేక వ్యర్థ పదార్థాలు అధికంగా చేరిపోయాయి. చెరువులో పీవోపీ విగ్రహాలు అలాగే ఉండటంతో కలుషితంగా మారింది. చెరువు కట్టకు దగ్గరలో తవ్వడం వల్ల అధికవర్షాలకు ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కూటమి నేతల వాదనలు ఇలా..
కట్ట మంచి చెరువులో నిర్వహించిన అక్రమ తవ్వకాల వ్యవహారం కొన్ని నెలలుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కట్టమంచి చెరువులో పూడికతీత పనుల వల్ల చిత్తూరు నగర పరిధిలో ఉండే బోర్లకు నీరు రీచార్జ్ అవుతుందని వెల్లడిస్తున్నారు. చిత్తూరు నగర పరిధిలో ఉండే దాదాపు 500 బోర్లకు పూడికతీత పనుల వల్ల ప్రయోజనం కలుగుతుందని కూటమి నేతలు వాదిస్తున్నారు. అయితే నిష్ణాతుల అభిప్రాయాలు, అధికారుల అనుమతులు, పర్యావరణ నిబంధనలు పాటించకుండా అక్రమంగా కట్టమంచి చెరువులో అక్రమ తవ్వకాలు నిర్వహించడం భవిష్యత్తులో నష్టమేనని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు.
కట్ట మంచి చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేశారు. చెరువులో అధిక లోతుకు మట్టి తవ్వడంతో కట్ట బలహీనపడి గండి పడే ప్రమాదం పొంచి ఉంది. చెరువులో ఎక్కువ లోతుకు మట్టి తవ్వేయడంతో డేంజర్ జోన్‌లో ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉండే కట్టమంచి చెరువుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అటు వంటి చెరువును తమ అక్రమార్జన కోసం స్వరూపాన్నే మార్చేశారు. ఫలితంగా అధిక వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని నగర వాసులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు.

కట్టమంచి.. ప్రమాదం పొంచి

కట్టమంచి.. ప్రమాదం పొంచి

కట్టమంచి.. ప్రమాదం పొంచి

కట్టమంచి.. ప్రమాదం పొంచి