
పేలుడు పదార్థాల రవాణాలో ఐదేళ్ల జైలు
చిత్తూరు అర్బన్/చిత్తూరు లీగల్: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్, జిల్లా సెషన్స్ న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కథనం మేరకు.. 2019 ఫిబ్రవరి 22వ తేదీన కుప్పం మండలం మల్లనూరు–తిరుపత్తూరు రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
తమిళనాడుకు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా 40 జిలెటిన్ స్టిక్స్, 40 డిటోనేటర్లు లభించాయి. ట్రాక్టర్‌ను సీజ్ చేసిన అప్పటి కుప్పం సీఐ జిటి.నాయుడు.. తమిళనాడు వేలూరుకు చెందిన నిందితుడు మురుగన్ మన్నుకన్(39)ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. అనంతరం నిందితుడిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.