
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఐరాల: అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఫారేస్ట్ రేంజ్ అధికారి కథనం మేరకు.. సోమవారం తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ అధికారికి పులిచెర్ల సమీపంలో కొంతమంది ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ప్లయింగ్ స్క్వాడ్ బృందం రాత్రి 10 గంటల సమయంలో పులిచెర్ల క్రాస్ సమీపంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. ఇన్నోవా కారు వేగంగా వచ్చింది. పసిగట్టి ఐరాల మార్గంలోకి వెళ్లగా పోలీసులు వెంబడించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ బృందం మండలంలోని గుడిపల్లె సమీపంలోని మామిడి తోట పక్కన ఇన్నోవా కారుతో పాటు 439.100 కిలోల బరువున్న 13 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పుల్లిచెర్ల నుంచి సుమారు 30 కి.మీ దూరం వరకు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నామన్నారు. నిందితుడు కారు వదిలి పరారయ్యాడని తెలిపారు. వాటి విలువ రూ.18,64,857 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలో సెక్షన్ అధికారి శశికుమార్, బీట్ అధికారులు చంద్రబాబు, ప్రసాద్‌కుమార్, వాచర్లు భార్గవ్, రాజా తదితరులు పాల్గొన్నారు.