
తిరుపతిలో కత్తితో రౌడీషీటర్ హల్‌చల్
తిరుపతి క్రైమ్: తిరుపతిలోని విక్టరీ వైన్స్ వద్ద ఆదివారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీవీఎస్ సర్కిల్ వద్ద ఉన్న ఓ వైన్ షాప్ ముందు వీరంగం సృష్టించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు.. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తన బృందంతో ఆ యువకుడిని, అతనితో పాటు ఉన్న మరో యువకుడిని వీడియో ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ కత్తితో హల్‌చల్ చేసిన వ్యక్తి రౌడీషీటర్ ఫిరోజ్, పక్కన ఉన్న వ్యక్తి సయ్యద్ బాషాగా గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడు ఫిరోజ్ గతంలో కేసుల్లో నేరస్తుడనీ, అతను చాలా కాలంగా పరారీలో ఉన్నాడని తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారించామని..వారిపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయని.. తెలిపారు.
నగరంలో నడిపించుకుంటూ కోర్టుకు
రెండు రోజుల క్రితం చిత్తూరులో లైంగిక దాడి కేసులో నిందితులను పోలీసులు కోర్టు వరకు నడిపించుకుని తీసుకెళ్లారు. అదే తరహాలో తిరుపతిలో కత్తితో హల్‌చల్ చేసిన నిందితులు ఫిరోజ్, సయ్యద్ బాషాలను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండ్‌కు తర లించామని తెలిపారు.