
ట్రాక్టర్ల దొంగలు అరెస్ట్
గుడిపాల: రెండు ట్రాక్టర్లను దొంగతనం చేసిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం.. గుడిపాల మండలం, పశుమంద దళితవాడకు చెందిన వినాయకం ట్రాక్టర్‌ను జూలై 21వ తేదీ రాత్రి దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అలాగే సెప్టెంబర్ 30వ తేదీన కృష్ణజమ్మాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబునాయుడు ట్రాక్టర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. వీటిపై కేసు నమోదైంది. చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనం జరిగిన ప్రదేశం నుంచి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ట్రాక్టర్లు రెండూ తమిళనాడు వైపుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు తమిళనాడు మేల్పాడి దారిలో నిఘా పెట్టారు. సోమవారం చలిచీమలపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కమ్మతిమ్మాపల్లె వైపు నుంచి మేల్పాడి వైపుగా రెండు ట్రాక్టర్లు.. వాటి ముందు ఒక మోటార్ సైకిల్‌లో వస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, కాట్పాడి తాలూకా, కోదండ రామాపురం గ్రామానికి చెందిన బద్రి అలియాస్ సాయికుమార్(26), కార్తీక్(19), రాజమణి(47) ఉన్నారు. వారి నుంచి రెండు ట్రాక్టర్ల తోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.18 లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు వారు పేర్కొన్నారు.