
ఫ్యాను పాటకు డ్యాన్స్ వేస్తే ఎస్‌ఐ కొట్టారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో ఖాకీలు కూటమి పార్టీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ పాటకు డ్యాన్స్ వేశాడనే నెపంతో గుడిపాల మండలంలో ఓ బాలుడిపై ఎస్‌ఐ దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. తాను వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ పాటకు డ్యాన్స్ వేస్తే టీడీపీ నేతల కుట్రతో ఎస్‌ఐ కక్షపూరితంగా తనపై దాడి చేసినట్లు గుడిపాల మండలం 189 కొత్తపల్లికి చెందిన యశ్వంత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఆరోపించారు. చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం దళిత నేతలు, గ్రామస్తులతో కలసి మీడియాతో మాట్లాడాడు. గతనెలలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకలో అందరితో పాటు తాను కూడా పాల్గొన్నానన్నాడు. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ పాటకు డాన్స్ చేశానని తెలిపాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుడిపాల ఎస్‌ఐ తనను పిలిచి అకారణంగా కొట్టి హింసించారని ఆరోపించాడు. కొట్టిన విషయా న్ని నాయకుల వద్దకు వెళ్లి చెబితే.. భవిష్యత్తు లేకుండా చేస్తానని ఎస్‌ఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపై డీజేకు పర్మిషన్ లేదని కేసులు నమోదు చేశారన్నాడు. దీని వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని వివరించాడు. ఈ విషయమై ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని, దాడిచేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దళిత నేత గడ్డం విజయ్ మాట్లాడుతూ.. పాటకు డాన్స్ వేస్తే బాలుడి చెంపపై, చేతులు వాచేలా కొట్టడం సరికాదని మండిపడ్డారు. బాలుడికి న్యాయం జరగకపోతే మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.