
ఖాకీలు మారినప్పుడల్లా ఇదే సమస్య
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ట్రాఫిక్ నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కొత్త అధికారులు ఎవరు వచ్చారో తెలుసుకోవాలంటే చిత్తూరు–వేలూరు రోడ్డులోని ఎంఎస్‌ఆర్ కూడలి వద్ద చూస్తే అర్థమైపోతుంది. ట్రాఫిక్ స్టేషన్‌కు ఎవరైనా కొత్తగా వస్తే చాలు.. తొలుత ఎంఎస్‌ఆర్ కూడలి నుంచి చిత్తూరు నగరంలోకి వచ్చే రోడ్డును మూసేయడం అలవాటుగా మారిపోయింది. కొద్దిరోజుల తరువాత ఇలా చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోందని గ్రహించి, ఆపై రోడ్డుకు అడ్డుగా ఉన్న బోర్డులను తీసేసి.. వాహనాలను అనుమతిస్తారు. ట్రాఫిక్ స్టేషన్‌కు బదిలీపై కొత్తగా అధికారి వచ్చినప్పుడంతా ఇదే పరిస్థితి. కిందిస్థాయి ఉద్యోగులు విషయం చెప్పడం లేదో..? ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన లేకో..? తెలియడంలేదు గానీ.. అధికారుల తీరు వల్ల వాహనచోదకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డుకు అడ్డుగా బోర్డులు పెట్టడం వల్ల వాహనాలన్నీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ రెండు ద్విచక్రవాహనాలు వెళ్తే, వెనుకవైపు ఆటో వెళ్లడం కష్టతరంగా మారుతోంది. ఇక బెంగళూరు–చిత్తూరు వైపునకు వచ్చే వాహనాలు ఇదే మలుపు వద్ద రావడంతో రెండు వైపులా ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి. చీకటి పడితే దొంగతనంగా గ్రానైట్‌ను లారీల్లో చిత్తూరులోని ఓవర్ బ్రిడ్జిపై తీసుకెళుతున్నా.. పట్టించుకోని పోలీసులు సామాన్యులు తిరిగే రోడ్లను మూసేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
డీఈఓ కార్యాలయం వద్ద స్తంభించిన వాహనాలు
ఎంఎస్‌ఆర్ కూడలి వద్ద రోడ్డుకు అడ్డుగా పెట్టిన బోర్డులు

ఖాకీలు మారినప్పుడల్లా ఇదే సమస్య