
గుర్తుకొస్తున్నాయ్..
కార్వేటినగరం : వారంతా కార్వేటినగరం టీటీసీ కళాశాలలో చదువుకున్నారు.. చదువులు పూర్తవ్వగానే ఎవరికి వారే వెళ్లి పోయారు. ఎవరు ఎక్కడ స్థిరపడ్డారో ఎవరికీ తెలియదు. ఎక్కడో ఒకరో ఇద్దరో అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకునేవారు. ఇతర మిత్రులను వివరాలను గుర్తు చేసుకునేవారు. ఇంతలో ఒక ఫోన్ కాల్ టీటీసీ కళాశాల /్ఞాపకాలను గుర్తు తెచ్చింది. డైట్ కళాశాలలో అప్పటి స్నేహితులతో మళ్లీ కలయికకు శ్రీకారం చుడుతున్నామనే మాటలు వారందరినీ ఒకటి చేశాయి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడో ఉన్న వారందరనీ ఒకటిగా చేసింది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ డైట్‌లో విద్యార్థులుగా మారిపోయారు. కార్వేటినగరం జిల్లా విద్యాశిక్షణా సంస్థలో 1985–86 విద్యాసంవత్సరంలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చదివిన విద్యార్థులు ఆదివారం డైట్ కళాశాలలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. అప్పట్లో వంద మంది విద్యార్థులు కలసి ఒక సంవత్సరం పాటు టీటీసీ చదువుకున్నారు. వీరిని ఒకటి చేయాలనే ఉద్దేశంతో కార్వేటినగరానికి చెందిన ఆ బ్యాచ్ విద్యార్థులు గాజుల నాగేశ్వరరావు, శేఖర్, ఆనంద్, మురుగన్ స్నేహితుల వివరాలను సేకరించి అపూర్వ కలయిక ప్రయత్నంలో విజయం సాధించారు. 39 సంవత్సరాల అనంతరం డైట్ కళాశాలలో కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు, వయసు మీరినా ఆట పాటలతో సందడి చేశారు.