
కూటమిలో గూడుగట్టిన కక్ష!
పేదల ఇళ్లపై పిడుగు కట్టలేదని 1,624 నివాసాల రద్దు ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయని ప్రభుత్వం జిల్లాలో నిలిచిపోయిన పక్కాగృహాల నిర్మాణ పనులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లపై కూటమి సర్కారు కక్ష పెంచుకుంది. వివిధ దశల్లో ఆగిన గృహాలకు సక్రమంగా బిల్లులందించకుండా వేధిస్తోంది. వసతి లేక పనులు ప్రారంభించని వారిని లబ్ధిదారుల జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. నిరుపేదల సొంతింటి కలను శాశ్వతంగా దూరం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. చేతనైతే సాయం చేయాల్సింది పోయి.. 1,624 గృహాలను రద్దు చేసేసింది. ఎప్పటికై నా తమదైన గూడులో నివసించవచ్చని ఆశించిన బడుగులపై ఆకాంక్షలను పిడుగుపాటుకు గురిచేసింది.
పలమనేరు : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 609 జగనన్న లేఅవుట్లలో 77,365 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. అందులో 46,163 వేల గృహాల నిర్మాణం పూర్తి చేయించింది. 31,203 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రణాళిక మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 2,389మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికీ 4,330 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఆగింది. వాటిలో ఇప్పటికీ పనులు ప్రారంభించి 1,624 ఇళ్లకు మ్యాపింగ్ , జియోట్యాగింగ్ లేదని కూటమి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో తొలగించింది. గత ప్రభుత్వంలో వీటి నిర్మాణాలకోసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని హౌసింగ్ అధికారులు చెబుతున్నప్పటికీ లబ్ధిదారులు పనులు చేపట్టేందుకు ధైర్యం చేయడంల లేదు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభించని ఇళ్లను ప్రభుత్వం రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్తవాటి ఊసేలేదు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాటి కంటే అధికంగా ఇళ్లను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఊదరగొట్టారు. తీరా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాది వేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే జిల్లాలో పంచాయతీలవారీగా పక్కా ఇళ్లకు పలువురు నేతలు అర్జీలు తీసుకున్నారు. కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్ అధికారులకు వాటిని పంపారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 30వేల మందిని లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఇళ్ల రద్దుపై హౌసింగ్‌శాఖ అధికారులనే సంప్రదిస్తే ప్రభుత్వ పాలసీని తాను అమలు చేయాల్సిందనే చెబుతున్నారు. దీనిపై జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు మేనేజర్ సుబ్రమణ్యాన్ని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 1,624 ఇళ్లును రద్దు చేసింది వాస్తవమేనని స్పష్టం చేశారు.