
ఆకలి కేకలు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో రేషన్ పంపిణీ ఆలస్యమవుతోంది. ఈనెల కోటాలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఇంతవరకు పలు షాపులకు సరుకులు చేరలేదు. పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు కుంటిసాకులు చెతున్నారు. ఈ క్రమంలో రేషన్ దుకాణదారులు, కార్డుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆకలితో కడుపు మాడ్చుకుంటున్నారు.
జిల్లాలో 5.40 లక్షల రేషన్‌కార్డులున్నాయి. వీటికి 14 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరుకులు సరఫరా అవుతుంటాయి. ప్రతి నెలా 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3,500 మెట్రిక్ టన్నుల చక్కెర అవసరమవుతోంది. అయితే ఈనెల కావాల్సినంత మేర సరుకు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు కేటాయించలేదు. జిల్లాలోని రేషన్ షాపులకు అరకొరగా సరుకులు చేరాయి. జిల్లా వ్యాప్తంగా 1,339 రేషన్ దుకాణాలుంటే దాదాపు 250 షాపులకు పైగా సరుకులు చేరలేదు. దీంతో కార్డుదారులు పస్తులతో కడుపుమాడ్చుకోవాల్సి వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే..మాకు తెలియదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆగ్రహానికి గురవుతున్నట్లు వాపోతున్నారు.
పట్టించుకునే వారేరి?
బియ్యం సరఫరా కాలేదని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 250పైగా షాపులకు సరుకులు చేరలేదని నివేదిస్తున్నా ఏ మాత్రం కదలికలు లేవని ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు వాపోతున్నారు. పంపిణీ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. మరో వైపు షాపులకు సరుకులు సరఫరా చేసిన వివరాలు చూపించడం లేదని అంటున్నారు. ఈ పాస్, ఆన్‌లైన్‌లో తలెత్తిన కారణాల వల్ల కేటాయింపు ఆలస్యమైందని చెప్పుకొస్తున్నారు. ‘మాకు ఏం సంబంధం లేదు.. వెళ్లి ప్రభుత్వాన్ని అడగండి’ అని దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వారు ఆగ్రహానికి గురవుతున్నారు.
మాకేం తెలుసు?
రేషన్ షాపులకు బియ్యం రాలేదంటే మాకే తెలుసు. వెళ్లి వాళ్లను అడగండి. మా చేతులో ఏముంది. బియ్యం వచ్చాయా... రాలేదా అనే వివరాలు మా దగ్గర లేవు. షాపుల్లో బియ్యం మిగిలి ఉంటాయి. వాటిని ఇస్తారులే. జిల్లాలో 5.4 లక్షల కార్డులుంటే 2.1 లక్షల కార్డుదారులు సరుకులు తీసుకున్నారు. ఇంకా టైం ఉంది. 17వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు సరుకులు రాలేదంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. – శంకరన్, డీఎస్‌ఓ, చిత్తూరు